నిత్యావసర సరుకుల డెలివరీకి జొమాటో గుడ్‌బై

13 Sep, 2021 03:13 IST|Sakshi

న్యూఢిల్లీ: నిత్యావసర వస్తువుల డెలివరీ సేవలను సెపె్టంబర్‌ 17 నుంచి నిలిపివేస్తున్నట్టు జొమాటో ప్రకటించింది. ‘జొమాటోలో మా వినియోగదార్లకు ఉత్తమ సేవలను, వ్యాపార భాగస్వాములకు అతిపెద్ద వృద్ధి అవకాశాలను అందించాలని భావిస్తున్నాము. ఇందుకు ప్రస్తుత మోడల్‌ ఉత్తమ మార్గం అని మేము నమ్మడం లేదు. అందుకే ఈ పైలట్‌ గ్రాసరీ డెలివరీ సేవలను నిలిపివేయాలని అనుకుంటున్నాము’ అని కంపెనీ తన భాగస్వాములకు ఈ–మెయిల్‌ ద్వారా తెలిపింది. ‘స్టోర్లలో వస్తువుల జాబితా క్రియాశీలకం. నిల్వ స్థాయిలూ తరచూ మారుతున్నాయి.

దీని కారణంగా ఆర్డర్లలో అంతరం ఏర్పడి పేలవమైన కస్టమర్ల అనుభూతికి దారితీస్తోంది. మా వేదిక ద్వారా ఇకపై సరుకుల డెలివరీని ఎట్టిపరిస్థితుల్లోనూ చేపట్టబోం. 10 నిముషాల్లోనే సరుకుల డెలివరీతో గ్రోఫర్స్‌ అధిక నాణ్యమైన సేవగా నిలిచింది. జొమాటో వేదిక ద్వారా సరుకుల డెలివరీ ప్రయత్నాల కంటే గ్రోఫర్స్‌లో కంపెనీ పెట్టుబడులు భాగస్వాములకు మెరుగైన ఫలితాల ను ఇస్తాయి’ అని జొమాటో స్పష్టం చేసింది. జొమాటో  నిత్యావసర సరుకుల డెలివరీ సేవలను ఎంపిక చేసిన నగరాల్లో పైలట్‌ ప్రా జెక్ట్‌ కింద గతేడాది ప్రారంభించింది. కాగా,  గ్రోఫర్స్‌లో మైనారిటీ వాటా కోసం రూ.745 కోట్లు వెచి్చంచినట్టు జొమాటో గతంలో తెలిపింది.

మరిన్ని వార్తలు