జొమాటో షాకింగ్‌ రిపోర్ట్‌: రూ.28 లక్షల పుడ్‌ ఆర్డర్‌ చేసిన ఏకైక కస్టమర్‌!

30 Dec, 2022 20:08 IST|Sakshi

కొత్త సంవత్సరం రాబోతున్న తరుణంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ తమ వార్షిక నివేదికను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి మరో పుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో కూడా చేరింది. ఈ యాప్‌లో కూడా ఈ ఏడాది అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకాల జాబితాలో బిర్యానీ అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ వ్యక్తి 3000 ఫుడ్ ఆర్డర్‌లను ఇచ్చినట్టు పేర్కొంది.ఇదే కాక మరెన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అవేంటో వాటిపై ఓ లుక్కేద్దాం!

నివేదిక ప్రకారం.. ఈ ఏడాది ఢిల్లీకి చెందిన ఓ యూజర్ యాప్ ద్వారా 3300 ఆర్డర్లు చేయగా, మరో యూజర్ యాప్ ద్వారా 1,098 కేక్‌లను ఆర్డర్ చేశారట. అంతే కాదు, 2022లో మరో కస్టమర్‌ రూ. 6.96 లక్షల విలువైన తగ్గింపులను పొందగలిగారని కంపెనీ వెల్లడించింది.

జొమాటో తమ కస్టమర్‌లు ఈ సంవత్సరం విలాసవంతంగా ఖర్చు చేశారని, అందులో ఒకరు ఒకే ఆర్డర్‌లో రూ. 25,000 కంటే ఎక్కువ విలువైన పిజ్జాలను ఆర్డర్ చేశారని వెల్లడించింది. ఓ పూణే నివాసి ఈ ఏడాది జొమాటో యాప్‌ ద్వారా పుడ్‌ కోసం రూ. 28 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. 

ఆర్డర్ల విషయానికొస్తే.. దేశవ్యాప్తంగా యాప్‌లో అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ వెల్లడిస్తూ, 2022లో అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకంగా జొమోటో బిర్యానీకి పట్టం కట్టింది. ఈ కంపెనీ ప్రత్యర్థి ప్లాట్‌ఫారమ్ స్విగ్గి విషయంలో కూడా అలాగే ఉంది.  నివేదిక ప్రకారం, బిర్యానీ తర్వాత మసాలా దోస, చికెన్ ఫ్రైడ్ రైస్, పనీర్ బటర్ మసాలా, బటర్ నాన్, వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ, తందూరి చికెన్ ఉన్నాయి.

చదవండి: సంపన్నులకు కలిసిరాని 2022.. బిలియనీర్‌ క్లబ్‌ నుంచి 22 అవుట్‌!

మరిన్ని వార్తలు