జనవరి 1 నుంచి స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ ధరలు పెరగనున్నాయి?

20 Dec, 2021 21:11 IST|Sakshi

కొత్త ఏడాది 2022 జనవరి 1 నుంచి జొమాటో, స్విగ్గీ వంటి ఆన్‌లైన్‌ ఫుడ్ యాప్స్ ద్వారా వినియోగదారులు ఆహారం ఆర్డర్ చేస్తే సంస్థలు5 శాతం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్‌టీ) చెల్లించాల్సి ఉంటుంది. లఖ్‌నవూ వేదికగా సెప్టెంబర్ 17న జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశంలో జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్‌ అగ్రిగేటర్‌ సంస్థలు పన్ను చెల్లించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆ సమావేశంలో ఫుడ్‌ డెలివరీ యాప్‌లను రెస్టారెంట్స్‌ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.

జనవరి 1, 2022 నుంచి జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్‌ అగ్రిగేటర్‌ సంస్థలు అందించే సేవలపై 5 శాతం జీఎస్‌టీ విధించనున్నట్లు తెలిపారు. ఇక జొమాటో, స్విగ్గీ వంటి ఆహార డెలివరీ యాప్‌లను రెస్టారెంట్లుగా పరిగణించి, వాటి ద్వారా చేసిన సరఫరాలపై 5 శాతం జీఎస్‌టీ పన్ను విధించనున్నారు. రెస్టారెంట్లలో భోజనం చేసినప్పుడు ఆయా సంస్థలు 5 శాతం పన్ను విధిస్తున్నాయి. కానీ స్విగ్గీ, జొమాటో నుంచి ఆర్డర్‌ చేసినప్పుడు పన్ను ఎగవేత జరుగుతోందని కేంద్రం గుర్తించింది.

రెండేళ్లలో దాదాపు రూ.2 వేల కోట్లు నష్టపోయినట్టు కూడా తెలిపింది. దీంతో పన్ను ఆదాయం తగ్గుతోందని భావించి ఫుడ్‌ అగ్రిగేటర్లే ఇకపై తమకు వచ్చే ఆర్డర్లపై పన్ను చెల్లించాలని ఆదేశించింది. అంటే రెస్టారెంట్లు సొమ్ము చేసుకుంటున్న పన్నును వారి నుంచి వసూలు చేసి స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్‌ అగ్రిగేటర్‌ సంస్థలు కేంద్రానికి చెల్లించాలన్నమాట. ఈ లావాదేవీలో వినియోగదారుడిపై ఎలాంటి అదనపు భారం మోపడం లేదు అని కేంద్రం పేర్కొంది.

(చదవండి: ఒమిక్రాన్‌ పంజా..! మరో కీలక భేటీ వాయిదా...!)

మరిన్ని వార్తలు