ప్రపంచవ్యాప్తంగా జూమ్ యాప్ డౌన్

23 Aug, 2021 21:14 IST|Sakshi

కరోనా మహమ్మారి భాగ పాపులర్ అయిన ప్రముఖ వీడియో-కాన్ఫరెన్సింగ్ జూమ్ యాప్ సర్వర్లలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా షట్ డౌన్ అయ్యింది. ఆస్ట్రేలియాలో వినియోగదారులు ఎక్కువగా ఈ సమస్యలను ఎదుర్కొన్నారు. కొద్ది సమయం తర్వాత ఆస్ట్రేలియాలో ఏర్పడిన స‌మ‌స్య‌ను పరిష్కరించినట్లు సంస్థ తెలిపింది. తాజాగా భారతదేశంలో కూడా సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. భారతీయ జూమ్ వినియోగదారులు వీడియో మీటింగ్స్ యాప్ లో వచ్చిన సమస్యల గురించి ఫిర్యాదు చేస్తున్నారు.

డౌన్ డిటెక్టర్ వెబ్ సైట్ ప్రకారం.. జూమ్ యాప్ మధ్యాహ్నం 1 గంటల నుంచి భారతదేశంలో సమస్యలు వస్తున్నాయి. ఇప్పటి వరకు 600 మందికి పైగా వినియోగదారులు జూమ్ వెబ్ సైట్ లో తమ సమస్యలను నివేదించారు. చాలా మంది వినియోగదారులు తమ సమస్య గురుంచి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్, ట్విట్టర్లో ఫిర్యాదు చేస్తున్నారు. ఒకవేళ మీరు కనుక ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే సర్వర్లో ఏర్పడిన సమస్యను పరిష్కరించే వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. డౌన్ డిటెక్టర్ నివేదిక ప్రకారం.. 48 శాతం వినియోగదారులు ఈ సమస్యలను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. 30 శాతం మంది వినియోగదారులు వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభించలేకపోయారు. ఈ సమస్య భారతదేశం, ఆస్ట్రేలియా దేశాలకు మాత్రమే పరిమితం కాలేదు, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఈ సమస్య ఏర్పడింది. తాత్కాలికంగా గూగుల్ మీట్ మరో యాప్ లను వాడుకోవచ్చు.(చదవండి: మారుతి సుజుకిపై భారీ జరిమానా విధించిన సీసీఐ)


 

మరిన్ని వార్తలు