బిడ్డను మాకు ఇవ్వండయ్యా...

21 Aug, 2023 11:40 IST|Sakshi

చిత్తూరు రూరల్‌: చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి బాత్‌రూమ్‌లో గర్భిణి ప్రసవించి వదిలి వెళ్లిన పసికందుకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈనెల 16వ తేదీ వేకువజామున కడుపు నొప్పితో వచ్చిన ఓ గర్భిణి ఆస్పత్రి బాత్‌రూంలోనే ప్రసవించి... బిడ్డను వదిలి వెళ్లిన ఘటన విధితమే. ఆపై బిడ్డకు ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స అందిస్తున్నారు. పుట్టినప్పుడు బిడ్డ బరువు 1.4 కేజీలుండగా..ప్రస్తుతం 1.5 కేజీలుందని వైద్యులు చెబుతున్నారు. 2 కేజీలు దాటేంత వరకు ఎస్‌ఎన్‌సీయూలోనే బిడ్డకు చికిత్స అందించాల్సి ఉంటుందని వెల్లడించారు.

దీంతో పాటు శ్వాస తీసుకోవడంలో కూడా బిడ్డకు కాస్త ఇబ్బందులు ఉన్నాయని..మరో రెండు రోజుల్లో ఈ సమస్య కూడా రికవరీ అవుతుందన్నారు. బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం వల్ల నాలుగు వారాల పాటు చికిత్స అందించాల్సి ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ఆ తర్వాతే సంరక్షణకు ఐసీడీఎస్‌ శిశువిహార్‌కు పంపనున్నారు. ప్రస్తుతం ఆశాఖ సిబ్బంది పర్యవేక్షణలోనే బిడ్డకు వైద్య సేవలు చేస్తున్నారు. కాగా బిడ్డ వదిలి వెళ్లిన ఘటనపై కలెక్టర్‌ ఆదేశాలతో డీఐఓ రవిరాజు విచారణ కూడా పూర్తి చేశారు. దీనిపై సోమవారం కలెక్టర్‌కు నివేదిక సమర్పించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

బిడ్డను మాకు ఇవ్వండయ్యా...
ఆడబిడ్డలంటే చులకన చూసే కళ్లు..ఇప్పటికే చాలానే ఉన్నాయి. ఆడబిడ్డ పుట్టిందని ఆమడ దూరంలోనే నిలబడే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను తరచూ చూస్తుంటాం. మగ సంతానం లేదని ఆత్మహత్యలు చేసుకున్న కేసులు సైతం చాలానే ఉన్నాయి. అయితే ఈ వదిలి వెళ్లిన బిడ్డ కోసం పలువురు ముందుకు వస్తున్నారు. ఆ బిడ్డను తమకు ప్రసాదించండంటూ ఆస్పత్రి అధికారులకు నివేదించుకుంటున్నారు. అసలు తల్లి లేకుంటే.. తామున్నామంటూ.. క్యూ కడుతున్నారు. ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటామంటూ హామీ ఇస్తున్నారు. ఇలా ఆ బిడ్డనుకోరుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అధికారులు మాత్రం బిడ్డను ఐసీడీఎస్‌కు అప్పగించామని, ఇక చట్ట ప్రకారం వెళ్లాల్సిందేనన్ని స్పష్టం చేస్తున్నారు. బిడ్డను కోరుకునే వారు దతత్త ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని వివరిస్తున్నారు.

మరిన్ని వార్తలు