సేంద్రియం.. సుస్థిరం

1 Oct, 2023 01:06 IST|Sakshi
మిట్టపాళెంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్న దృశ్యం (ఫైల్‌)

నగరి మండలం వేలావడి వద్ద జీవామృతం

తొట్టె నిర్మించుకుంటున్న రైతు శ్రీనివాసులు

ప్రకృతి వ్యవసాయంపై రైతులు మక్కువ పెంచుకుంటున్నారు. రసాయన ఎరువులు.. పురుగు మందుల వినియోగాన్ని వదిలేస్తున్నారు.. సహజ సిద్ధంగా లభించే ఆకులతో కషాయాలు తయారు చేసుకుంటున్నారు. తద్వారా భూసార పరిరక్షించుకుటున్నారు. ఈ మేరకు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధిస్తున్నారు. ఆరోగ్యకర పంటలను ఉత్పత్తి చేస్తూ ముందడుగు వేస్తున్నారు.

నగరి : సేంద్రియ వ్యవసాయంపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. రసాయనిక ఎరువులు, పురుగు మందులకు బదులుగా ప్రకృతిలో దొరికే ఆకుల కషాయాలతో సాగు చేపడుతున్నారు. రూ.వేలల్లో ఖర్చయ్యే ఎరువులు, పురుగుల మందుల వాడకానికి స్వస్తి పలికి సొంతంగా కషాయాలను సిద్ధం చేసుకుంటున్నారు. పంచగవ్యం, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, నీమాస్త్రం, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, కంపోస్టు, వేప పిండి, జనుము తదితరాలను వినియోగిస్తున్నారు. జిల్లాలోని 697 పంచాయతీలకు గాను 174 పంచాయతీల్లో రైతులు సేంద్రియ పద్ధతులను అవలంభిస్తున్నారు.

ఈ ఏడాది జిల్లాలోని 39,349 మంది రైతులతో 58,850 ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో సాగు చేయడానికి ప్రకృతి వ్యవసాయ శాఖ లక్ష్యాన్ని నిర్ధారించుకుంది. ఈ మేరకు 29 వేల మంది రైతులతో 31,500 ఎకరాల్లో సాగు చేయిస్తోంది. మిగిలిన లక్ష్యాన్ని రబీ సీజన్‌లో పూర్తి చేసేందుకు సన్నద్ధమవుతోంది. నగరి మండలంలోనే 250 ఎకరాల వరు సేంద్రియ సాగు జరుగుతోంది. ఈ పద్ధతులను అవలంభించడం ద్వారా భూసారం కోల్పోవడం జరగదని, దిగుబడి ఎక్కువగా వస్తుందని, భూముల్లో భూసారం పెంచే వానపాములు తయారవుతాయని ప్రకృతి వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ పద్ధతిలో పండించిన పంటలు ఆరోగ్యకరమంటున్నారు.

శాశ్వత ప్రాతిపదికన జీవామృతం తొట్టెలు

ఘన జీవామృతాన్ని రైతులు పిడకల రూపంలో తయారు చేసి ఉంచుకునేవారు. ద్రవజీవామృతాన్ని ప్లాస్టిక్‌ తొట్టెల్లో క్యాన్లలో నిల్వ చేసుకునేవారు. ఈ క్రమంలో వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. పొలానికి నీరందించే కాలువల పక్కనే సిమెంట్‌ వరలతో 500 లీటర్ల సామర్థ్యం ఉన్న తొట్టెలను పక్కాగా నిర్మించుకుంటున్నారు. ఈ తొట్టెలకు అడుగున కొళాయి ఏర్పాటు చేసి నీటి కాలువల్లో వదిలేస్తున్నారు. ఇలా చేయడంతో నీటితో కలిసి ద్రవజీవామృతం సమంగా పొలానికి అందుతోంది. ఇది సత్ఫలితాలు ఇస్తున్నట్లు రైతులు వెల్లడిస్తున్నారు.

ఆరోగ్యకరమైన పంట

ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తే అధిక దిగుబడి రావడంతోపాటు ఆరోగ్యకరమైన పంట చేతికొస్తుంది. సేంద్రియ ఎరువుల తయారీలో సందేహాలు ఉంటే 95023 98214 నంబర్‌లో సంప్రదిస్తే అవగాహన కల్పిస్తాం. వాడే విధానాన్ని రైతులకు వివరిస్తాం.

– చంద్రశేఖర్‌, మాస్టర్‌ ట్రైనర్‌, ప్రకృతి వ్యవసాయం

రబీ నాటికి లక్ష్యం పూర్తి

సేంద్రియ సాగుతో ఆరోగ్యకరమైన పంటల వైపు రైతులను తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. జిల్లాలోని 30 శాతం గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాం. ఈ ఏడాది నిర్ణయించుకున్న లక్ష్యం వాతావరణ పరిస్థితుల ప్రభావంతో కొంత తగ్గినా రానున్న రబీ సీజన్‌లో లక్ష్యం పూర్తి చేస్తాం.

– జి.వాసు, జిల్లా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, ప్రకృతి వ్యయసాయం.

ప్రకృతి వ్యవసాయం దిశగా అన్నదాత అడుగులు రసాయన ఎరువుల వాడకంపై విముఖత సహజ సిద్ధ ఆకుల కషాయాల వినియోగం

మరిన్ని వార్తలు