పోలియో రహిత సమాజమే లక్ష్యం

1 Mar, 2024 01:36 IST|Sakshi

– జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : పోలియో రహిత సమాజమే లక్ష్యమని జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌ అన్నారు. గురువారం ఆయన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రూపొందించిన పోలియో చుక్కల కార్యక్రమం బ్యానర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మార్చి 3వ తేదీన జిల్లావ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పిల్లలకు పోలియో చుక్కలు వేయించేలా తల్లిదండ్రులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. 3వ తేదీ వేసుకోని పిల్లలకు 4, 5 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారన్నారు.

జిల్లావ్యాప్తంగా ఇలా..

జిల్లావ్యాప్తంగా 69 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ కేంద్రాల పరిధిలో 8 మంది ప్రోగ్రాం అధికారుల పర్యవేక్షణలో 142 రూట్లలో 1,415 కేంద్రాల పరిధిలో 20,9971 మంది 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు. ఇందులో 149 హైరిస్క్‌ ప్రాంతాలను గుర్తించామన్నారు. వీటిని మొబైల్‌ బూత్‌ల ద్వారా కవర్‌ చేస్తారని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆధ్వర్యంలో జిల్లా నోడల్‌ అధికారి, వ్యాధి నిరోధక టీకాల అధికారి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డా.రవిరాజు, డీపీఎంఓ డా.హర్షవర్ధన్‌, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌ డా.సుదర్శన్‌, మున్సిపల్‌ ఆఫీసర్‌ డా.లోకేష్‌, ఎన్‌సీడీ కోఆర్డినేటర్‌ డా.శిరీష, డెమో జయరాముడు, ఏపీడిమియాలజిస్ట్‌ శ్రీవాణి, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు