భారతదేశంలో సాంకేతిక విప్లవం

1 Mar, 2024 01:36 IST|Sakshi

నారాయణవనం: ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ స్వీయ అభివృద్ధితో భారతదేశం సాంకేతిక విప్లవాన్ని సృష్టిస్తోందని డీఆర్‌డీఏ మాజీ చైర్మన్‌, మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌ సైంటిఫిక్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ సతీష్‌ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక పుత్తూరు సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాలలో గురువారం నిర్వహించిన వికసిత్‌ భారత్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. సతీష్‌రెడ్డి మాట్లాడుతూ గడిచిన పదేళ్లలో దేశంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శరవేగంగా వృద్ధిరేటును సాధించిందని అన్నారు. ఇతర దేశాలపై ఆధారపడకుండా సొంత సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుందని వివరించారు. మన దేశం సొంతంగా తయారు చేసిన ఎస్‌ఎల్‌వీ, ఏఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లను విజయవంతంగా నింగిలోకి పంపిందని గుర్తు చేశారు. రక్షణ రంగంలో బ్రహ్మోస్‌, అగ్ని, అగ్ని–1,2,3, ఆకాష్‌, అర్జున్‌ ట్యాంకర్లు, న్యూక్లియర్‌ సబ్‌మైరెన్‌లతో దేశ రక్షణ బలాన్ని పెంచుకున్నామని అన్నారు. సబ్‌మైరెన్‌ల తయారీలో జర్మన్‌ తర్వాత మన దేశమే రెండో స్థానంలో ఉందని వివరించారు. నేడు ప్రపంచమే భారతదేశం వైపు చూసే స్థాయికి మనం సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి సాధించామని అన్నారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీలో యువ ఇంజినీర్లు పరిశోధనలు జరిపి దేశ ప్రతిష్టతను పెంచడానికి కృషి చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఐఐటీతో పాటు ఐసర్‌ను అభివృద్ధి చేసిందని అన్నారు. కళాశాలల చైర్మన్‌ డాక్టర్‌ అశోకరాజు మాట్లాడుతూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకే పరిమితం కాకుండా దేశ రక్షణలో, సాంకేతిక అభివృద్ధికి యువ ఇంజనీర్లు ప్రత్యేక భూమికను పోషించాలని పిలుపునిచ్చారు. అనంతరం సతీష్‌రెడ్డిని శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్స్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్ది, జనార్దన్‌రాజు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు