మెగా జాబ్‌ మేళాలో 397 మందికి ఉద్యోగాలు

1 Mar, 2024 01:38 IST|Sakshi

నగరి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నతవిద్య కమిషనర్‌ డా.పోలా భాస్కర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ మేళాలో 653 మంది విద్యార్థులు పాల్గొనగా వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు 397 మంది ఎంపికయ్యారు. గురువారం ఉదయం ప్రారంభమైన ఈ జాబ్‌మేళాకు నగరి, పుత్తూరు, కార్వేటినగరం, సత్యవేడు, శ్రీకాళహస్తిలోని రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు చొప్పున ఆరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నుంచి 433 మంది విద్యార్థులు, ఇతరులు 120 మంది పాల్గొన్నారు. పేటీఎం, డిక్సన్‌, అపోలో ఫార్మసీ, టెక్‌ మహీంద్ర, టాటా ఎలక్ట్రానిక్స్‌, అమేజాన్‌ వేర్‌హౌస్‌ తదితర 20 కంపెనీల ప్రతినిధులు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 6 కళాశాలల నుంచి 355 మంది, ఇతరులలో 42 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కళాశాల ప్రిన్సిపల్‌ డా.ఆర్‌.వేణుగోపాల్‌ మాట్లాడుతూ వచ్చిన ఉద్యోగాల్లో నైపుణ్యతను ప్రదర్శించి ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. ఈ మేళాలో పుత్తూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి కళాశాల ప్రిన్సిపల్స్‌ శ్రీనివాసులు రెడ్డి, సురేష్‌బాబు, శ్రీలత, ఆంగ్ల అధ్యాపకులు, నోడల్‌ రీసోర్సస్‌ సెంటర్‌ సమన్వయకర్త డా.పంకజ, అధ్యాపకులు పాల్గొన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు