ఆర్థిక సంఘం నిధులు విడుదల

2 Mar, 2024 12:15 IST|Sakshi
అగ్నికి ఆహుతైన మామిడి చెట్లు

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలోని పంచాయతీలకు 2023–24 ఏడాదికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం తొలి విడత నిధులు వచ్చినట్లు డీపీఓ లక్ష్మి శుక్రవారం తెలిపారు. ఆన్‌టైడ్‌ కింద రూ.11.69 కోట్లు, టైడ్‌ కింద రూ.17.55 కోట్లు మంజూరైనట్లు వివరించారు.

యువకుడి ఆత్మహత్య

వి.కోట: పట్టణంలోని భారత్‌నగర్‌లో శుక్రవారం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు..బైరెడ్డిపల్లె మండలం చప్పిడిపల్లె పంచాయతీ చండ్రిమాకులపల్లె గ్రామానికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు మణి(20), రామసముద్రానికి చెందిన సిద్ధమ్మను మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. గతంలో వేరే అమ్మాయిని ప్రేమించిన మణి, ఆమెను రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనిపై భార్యాభర్తలు తరచూ గొడవపడేవారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మరోసారి ఘర్షణ జరగడంతో మనస్తాపం చెందిన మణి ఇంట్లోనే ఉరేసుకున్నాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లింగప్ప తెలిపారు.

మెడికల్‌ షాపులో చోరీ

పుత్తూరు: స్థానిక గేట్‌పుత్తూరు కేబిన్‌ సమీపంలోని శ్రీసత్య మెడికల్‌ షాపులో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం తెల్లవారు జూమున షాపు తలుపులు తెరిచి ఉన్నట్లు గుర్తించిన స్థానికులు వెంటనే యజమాని ఓంకార్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. ఓంకార్‌ వచ్చి చూడగా క్యాష్‌ కౌంటర్‌లో ఉంచిన రూ.50 వేలు అపహరణకు గురైనట్లు గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చెరకుతోట దగ్ధం

బంగారుపాళెం: మండలంలోని దండువారిపల్లెలో శుక్రవారం సాయంత్రం విద్యుత్‌ షార్టుసర్క్యూట్‌ కారణంగా ఆదర్శరైతు జగదీష్‌రెడ్డికి చెందిన చెరకుతోట దగ్ధమైంది. తోటలోని ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగిందని బాధితుడు తెలిపాడు. సుమారు అర ఎకరాలోని పంట ఆహుతైందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికై నా ట్రాన్స్‌ఫార్మర్‌ను మార్చాలని కోరాడు.

కాలిపోయిన మామిడితోట

గంగవరం: మండలంలోని గోవిందశెట్టిపల్లెలో తాజుద్దీన్‌ అనే రైతుకు చెందిన మామిడితోటను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చేసిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. మందులు పిచికారీ చేసేందుకు తోటకు వెళ్లిన రైతు ఈ విషయం గుర్తించి కన్నీటిపర్యంతమయ్యాడు. పూత దశలోనే చెట్లకు నిప్పు పెట్టారని, సుమారు 150 చెట్లు పూర్తిగా కాలిపోయాయని వెల్లడించాడు. ఐదెకరా తోట నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.

ఆటో డ్రైవర్‌పై దాడి:

కేసు నమోదు

పెనుమూరు(కార్వేటినగరం) : ఆటో డ్రైవర్‌పై యువకులు దాడి చేసిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పెనుమూరు ఏఎస్‌ ఐ ఉమా మహేశ్వర్‌ కథనం మేరకు.. చిత్తూరు నగరంలోని 5వ డివిజన్‌ రఘరాం కాలనీకి చెందిన కిరణ్‌రాయల్‌ గురువారం పెనుమూరు మండలానికి తన ఆటోలో వచ్చాడు. తిరుగు ప్రయాణంలో ఉగ్రాణపల్లె వద్ద నలుగురు యువకులు ద్విచక్రవాహనాలను రోడ్డుపక్కన నిలిపి ఉన్నారు. వేగంగా వస్తున్న ఆటో నుంచి దుమ్ము వాహనాలపై పడిందని ఘర్షణకు దిగారు. కిరణ్‌రాయల్‌ తలపై గాయపరిచారు. బాధితుడు చిత్తూరు తాలుకా పోలీస్‌ స్టేషన్‌ల్లో ఫిర్యాదు చేశాడు. అయితే ఘటన పెనుమూరు పరిఽధిలో జరగడంతో కేసును పెనుమూరు పీఎస్‌కు రెఫర్‌ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

రికార్డుల పరిశీలన

గుడిపాల: ఉపాధి హామీ పథకంలో భాగంగా మండలంలో శుక్రవారం డ్వామా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రాజశేఖర్‌ రికార్డులను పరిశీలించారు. ప్రతి ఒక్క రికార్డు సక్రమంగా నిర్వహించి, వాటన్నింటినీ ఆడిట్‌ సమయంలో చూపించాలన్నారు. ఉపాధిహామీ పథకంలో కొనసాగుతున్న పనులు, కూలీల సంఖ్య తదితర విషయాలపై ఆయన ఆరా తీశారు. అనంతరం బసవాపల్లె ఫారెస్ట్‌లో క్యాటిల్‌ పాండ్‌ వర్క్‌ను ఆయన పరిశీలించారు.

whatsapp channel

మరిన్ని వార్తలు