ప్రేమోన్మాది ఘాతుకం

2 Mar, 2024 12:15 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధిత యువతి, ప్రేమోన్మాది మహేష్‌

చంద్రగిరి: తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. అర్ధరాత్రి సమయంలో యువతి ఇంట్లోకి ప్రవేశించి కత్తితో దాడికి పాల్పడి ఆమెను తీవ్రంగా గాయపరిచిన ఘటన చంద్రగిరిలో కలకలం రేపింది. కుటుంబ సభ్యుల కథనం.. చంద్రగిరి ఆర్‌ఎఫ్‌ రోడ్డుకు చెందిన యువతి చిన్నతనంలోనే తల్లిందండ్రులను కోల్పోయింది. ఆమె అమ్మమ్మ మంగమ్మ చిన్నప్పటి నుంచి యువతిని పెంచి పోషించింది. నర్సింగ్‌ పూర్తిచేసుకున్న యువతి ఏడాది క్రితం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సింగ్‌ శిక్షణ తీసుకుంటోంది. ఈ క్రమంలో తన పక్కింట్లో అద్దెకుంటున్న కృష్ణయ్య కుమారుడు పిడతల మహేష్‌ యువతికి పరిచయమయ్యాడు. కొన్నాళ్లు ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. తర్వాత మహేష్‌ చెడువ్యసనాలు తెలుసుకున్న యువతి అతని నుంచి దూరమైంది. అప్పటి నుంచి మహేష్‌ యువతిపై కక్ష పెంచుకున్నాడు. తరచూ వేధింపులకు పాల్పడేవాడు. అయితే వారికి మగదిక్కు లేకపోవడంతో ఏంచేసినా మిన్నకుండిపోయేవారు.

ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు

నెలన్నర క్రితం యువతి ఇంట్లోకి అక్రమంగా చొరబడిన ప్రేమోన్మాది మహేష్‌, యువతితో పాటు ఆమె అమ్మమ్మపై దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. స్థానికులు యువకుడిని అడ్డుకున్నారు. ఆపై యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. రక్షణ లేకపోవడంతో పది రోజుల క్రితం యువతి పెద్దమ్మ వచ్చి ఆమెను చైన్నెకి తీసుకెళ్లింది.

అద్దె ఇల్లు ఖాళీ చేసేందుకు రావడంతో..

యువతి చంద్రగిరి ఆర్‌ఎఫ్‌ రోడ్డులో ఉంటున్న అద్దె ఇల్లును ఖాళీ చేసేందుకు గురువారం రాత్రి తన పెద్దమ్మతో కలిసి చైన్నె నుంచి చంద్రగిరికి చేరుకుంది. విషయం తెలుసుకున్న మహేష్‌ అర్ధరాత్రి సమయంలో కత్తి తీసుకుని యువతి ఇంట్లోకి ప్రవేశించాడు. తర్వాత యువతిపై కత్తితో దాడిచేశాడు. ఆమె ఛాతి, ఎడమ చేతిపై దాడి చేయడంతో తీవ్ర రక్తగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో కత్తిని అక్కడ పడేసి ప్రేమోన్మాది మహేష్‌ పారిపోయాడు. అనంతరం స్థానికులు అక్కడకు చేరుకు ని, యువతిని 108 వాహనంలో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు రుయా ఆస్పత్రికి చేరుకుని దాడికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం దాడికి పాల్పడిన ప్రేమోన్మాది మహేష్‌ కో సం గాలిస్తున్నారు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

whatsapp channel

మరిన్ని వార్తలు