ఉన్నత విద్యకు దీవెన

2 Mar, 2024 12:15 IST|Sakshi
● పేద విద్యార్థుల చదువుకు సాయం ● జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల ● 29,407 మంది తల్లుల ఖాతాల్లో రూ.20.54 కోట్లు ● కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి కార్యక్రమం ● పాల్గొన్న ఎంపీ రెడ్డెప్ప, జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, కలెక్టర్‌ షణ్మోహన్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : నిరుపేద తల్లిదండ్రులకు తమ పిల్లల ఉన్నత చదువు భారం కాకూడదనే సదుద్ధేశంతో ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన పథకం అమలు చేస్తోందని ఎంపీ రెడ్డెప్ప వెల్లడించారు. శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రు నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా విద్యాదీవెన నగదు విడుదల చేశారు. కలెక్టరేట్‌ నుంచి ఎంపీతోపాటు జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, కలెక్టర్‌ షణ్మోహన్‌, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ టీడీపీ పాలనలో పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షగానే ఉండేదని విమర్శించారు.ఉన్నత చదువులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండేదని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిక పేద పిల్లలకు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తోందన్నారు. జెడ్పీచైర్మన్‌ శ్రీనివాసులు మాట్లాడుతూ టీడీపీ పాలనలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించేది కాదన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని చెప్పారు. ఏటా త్రైమాసికం వారీగా ఫీజురీయింబర్స్‌మెంట్‌ నిధులనునేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోందని తెలిపారు. దీంతో పిల్లలు సంతోషంగా చదువుకుంటున్నారని వెల్లడించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గత ఏడాది అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికానికి గాను ప్రభుత్వం విద్యాదీవెన నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ పథకం కింద జిల్లాలో 32,427 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతోందన్నారు. 29,407 మంది తల్లుల ఖాతాలలో రూ.20,54,29,471 నగదు జమ చేసినట్లు వివరించారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అయ్యే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సొమ్మును వారం, పది రోజుల్లో సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు. అనంతరం జగనన్న విద్యాదీవెన మెగా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో మేయర్‌ అముద, డీఆర్‌ఓ పుల్లయ్య, జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ రమ్య, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రాజ్యలక్ష్మి, బీసీ సంక్షేమ శాఖ అధికారి రబ్బానీబాషా, గిరిజన సంక్షేమ శాఖ అధికారి మూర్తి పాల్గొన్నారు.

జగనన్న పేరు నిలబెడతా

మా తల్లిదండ్రులు నన్ను ఉన్నత విద్యను చదివించలేని పరిస్థితి. నేను ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ పీవీకేఎన్‌ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నా. మాది పేద కుటుంబం. తండ్రి నా చిన్నతనంలో మృతి చెందారు. అమ్మే నన్ను చదివిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన నా కుటుంబానికి ముఖ్యమంత్రి జగనన్న చాలా మేలు చేస్తున్నారు. జగనన్న విద్యాదీవెన పథకం ఫీజురీయింబర్స్‌మెంట్‌ నా చదువుకు ఎంతో ఉపయోగపడుతోంది. బాగా చదివి జగనన్న పేరు నిలబెడుతా.

– నందిని, డిగ్రీ విద్యార్థిని, వి.కోట

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

నాలాంటి పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యాదీవెన పథకాన్ని ఏటా అందుకుంటున్నా. నేను పీవీకేఎన్‌ డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నా. మాది మధ్యతరగతి కుటుంబం. నేను ఉన్నత విద్య చదవాలంటే మొదట్లో తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ప్రభుత్వం అందజేస్తున్న విద్యాదీవెన, వసతి దీవెన పథకం లబ్ధితో నేను సంతోషంగా డిగ్రీ చదువుకుంటున్నా. మామేలు కోసం ఇంతలా ఆలోచిస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్జతలు.

– కృష్ణ, డిగ్రీ విద్యార్థి, కుప్పం

సకాలంలో అందిస్తున్నారు

గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సకాలంలో అందేది కాదు. డిగ్రీ చదవాలంటే తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన దుస్థితి గతంలో ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చారు. మాలాంటి పేద విద్యార్థులకు సకాలంలో విద్యాదీవెన, వసతి దీవెన నగదు అందిస్తున్నారు.

– కాంచన, డిగ్రీ విద్యార్థిని, కుప్పం

whatsapp channel

మరిన్ని వార్తలు