సంక్షేమమే ప్రజలకు శ్రీరామరక్ష

2 Mar, 2024 12:15 IST|Sakshi
పాలశీతలీకరణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి

శ్రీరంగరాజపురం : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ప్రజలకు శ్రీరామరక్షని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. శుక్రవారం ఎస్‌ఆర్‌పురంలో రూ.20 లక్షలతో నిర్మించిన పాలశీతలీకరణ కేంద్రం, వీవీపురంలో రూ.కోటితో నిర్మించిన సచివాలయ, రైతుభరోసా కేంద్రం, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ భవనాలు ఆయన ప్రారంభించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ జగనన్న ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని, పేదల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రజలకు మంచి చేస్తుంటే ఓర్వలేక ఎల్లోమీడియా సహకారంతో ప్రతిపక్షాలు బురదజల్లుతున్నాయని విమర్శించారు. ఒకప్పుడు ఏ పథకం కావాలన్నా అభివద్ధి పనులు జరగాలన్నా మండల కేంద్రంలోని పార్టీ ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలు, జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి ఉండేదన్నారు. ఇప్పడు ఆయా గ్రామాల్లోని సచివాలయాల ద్వారా ప్రతి సమస్య పరిష్కారమవుతోందని వెల్లడించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వీవీపురం వచ్చినప్పుడు గ్రామస్తుల ఆకాంక్ష మేరకు రోడ్డు వేయించామని తెలిపారు. ఇప్పటి వరకు ఎస్‌ఆర్‌పురం మండలంలో రూ.39 కోట్లతో రోడ్డు నిర్మించినట్లు వివరించారు. అలాగే కుశస్థలీ నదిపై రూ.29 కోట్లతో వంతెన, రూ.10లక్షల చొప్పున వెచ్చించి 54 ఆలయాలు, రూ.9కోట్లతో రోడ్లకు మరమ్మతులు నిర్మించామని తెలిపారు. తాగునీటి సరఫరా కోసం 30 ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు నిర్మించామన్నారు. ఒక్క ఎస్‌ఆర్‌పురం మండలంలోనే ఇన్ని అభివృద్ధి పనులను పారదర్శకంగా పూర్తి చేసినట్లు చెప్పారు. వైఎస్సార్‌సీపీ జీడీనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్తగా తన కుమార్తె కృపాలక్ష్మిని అధిష్టానం నియమించిందని, ఆమెను ఆశీర్వదించాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయడమే లక్ష్యంగా కృపాలక్ష్మి రాజకీయాల్లోకి వచ్చిందని, అవినీతి మరక అంటకుండా నిజాయితీగా పనిచేయాలని సూచించానని తెలిపారు. అనంతరం అర్హులకు జగనన్న ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ మణి, ఎంపీపీ సరిత, జెడ్పీటీసీ సభ్యుడు రమణప్రసాద్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ బాలసుబ్రమాణ్యంరెడ్డి, పెనుమూరు ఏఎంసీ అధ్యక్షుడు బండి కమలకర్‌రెడ్డి, సర్పంచ్‌లు హరిత, లక్ష్మమ్మ, ఎంపీటీసీ సభ్యులు శివయ్య, ఆదిలక్ష్మి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గురవారెడ్డి, పార్టీ మండల మాజీ కన్వీనర్‌ అనంతరెడ్డి, తహసీల్దార్‌ అల్‌ఫ్రెడ్‌, ఎంపీడీఓ మోహన్‌మురళి, ఏఓ కృషయ్య, వైద్యులు బాలసుబ్రమాణ్యంరెడ్డి, గౌరి, నాయకులు కుప్పయ్య, దామునాయుడు, డిసెంబర్‌శెట్టి, జనార్ధన్‌ పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

కార్వేటినగరం : అనారోగ్యంతో బాధపడుతున్న వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.15.20లక్షల చెక్కులను డిప్యూటీ సీఎం నారాయణస్వామి పంపిణీ చేశారు. శుక్రవారం పుత్తూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ పేదల పాలిట సీఎంఆర్‌ఎఫ్‌ ఓ వరమని తెలిపారు.

whatsapp channel

మరిన్ని వార్తలు