ఆటో బోల్తా... ఏడుగురికి గాయాలు

27 May, 2022 13:26 IST|Sakshi

భోగాపురం రూరల్‌: మండలంలోని సవరవిల్లి సమీపంలో జాతీయ రహదారిపై పాసింజర్‌ ఆటో గురువారం మధ్యాహ్నం అదుపుతప్పి రక్షణ కోసం ఏర్పాటుచేసిన ఇనుప రెయిలింగ్‌ను ఢీకొని బోల్తా పడింది. శ్రీకాకుళంలో పండగ నిమిత్తం వెళ్లిన  ఒక కుటుంబం తిరిగి విశాఖపట్నం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.   ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు, ఆరుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. ఒక మహిళ తలకు బలమైన గాయం తగిలి తీవ్ర రక్తస్రావమైంది. జాతీయ రహదారిపై రాకపోకలు చేసేవారు   తమ వాహనాలను ఆపి గాయాలపాలైన వారికి సహాయక చర్యలు చేపట్టారు.  

కారు ఢీకొని వ్యక్తికి..  
పార్వతీపురంటౌన్‌: జియ్యమ్మవలస మండలం నీచుకువలస గ్రామానికి చెందిన ముదిలి గోవిందనాయుడు  మోటార్‌సైకిల్‌పై ఖడ్గవలస వస్తుండగా పిట్టలమెట్ట బస్టాప్‌ వద్ద వెనుకనుంచి వస్తున్న కారు ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 వాహనంలో క్షతగాత్రుడిని పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఔట్‌పోస్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.  

ఆటో బోల్తా పడి మరో నలుగురికి..  
పార్వతీపురంటౌన్‌:  గుమ్మలక్ష్మీపురం మండలం మంగళాపురం గ్రామానికి చెందిన ఆరిక రఘురాములు, మండంగి కుమారి, కడ్రక లత్తులు ఆటో బోల్తా పడిన ప్రమాదంలో గాయపడ్డారు. బుధవారం సాయంత్రం వారంతా మదురువలస గ్రామంలో పెళ్లి ఫంక్షన్‌కు ఆటోలో వెళ్లి తిరిగి వస్తుండగా జి. శివడ గ్రామం దాటిన తరువాత మలుపువద్ద ఆటో అదుపుతప్పి   బోల్తాపడింది. గమనించిన స్థానికులు 108 వాహనం ద్వారా పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి వారిని తరలించారు. ఈ ఘటనపై ఔట్‌పోస్టు పోలీసులు కేసు నమోదు చేశారు.  

(చదవండి: బె‘ధర’గొడుతున్న చికెన్‌.. వేసవి కాలం కావడంతో.. భారీగా పెరిగిన రేట్లు!)

మరిన్ని వార్తలు