బోణి కొట్టిన భారత్‌‌

9 Mar, 2021 16:40 IST|Sakshi

తొమ్మిది వికెట్ల తేడాతో దక్షిణఫ్రికాపై గెలుపు

లక్నో: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా‌ బోణి కొట్టింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా.. టీమిండియా బౌలర్లు జులన్‌ గోస్వామి (4/42), గైక్వాడ్‌ (3/37), మాన్సీ జోషి (2/23) ధాటికి 41 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో లారా గుడాల్‌(49) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. అనంతరం కష్టసాధ్యం కాని‌ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌..  కేవలం 28.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకొని సునాయాస విజయాన్ని సాధించింది. ఓపెనర్ జేమిమా రోడ్రిగ్స్ (‌20 బంతుల్లో 9) విఫలమైనప్పటికీ, మరో ఓపెనర్‌ మంధన ( 64 బంతుల్లో 80 పరుగులు;10 ఫోర్లు, 3 సిక్స్‌లు), వన్‌ డౌన్‌ బ్యాటర్‌ పూనమ్‌ రౌత్‌లు ( 89 బంతుల్లో 62 పరుగులు; 8 ఫోర్లు)‌ భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. దీంతో భారత్‌ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించి 5 వన్డేల సిరీస్‌లో బోణీ కొట్టింది. 4 వికెట్లతో రాణించిన జులన్‌ గోస్వామి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికైంది.


 

మరిన్ని వార్తలు