English

ప్రపంచకప్‌ తర్వాత ఇదే పెద్ద మ్యాచ్‌: పోలార్డ్‌

10 Nov, 2020 18:24 IST|Sakshi

కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన క్రికెట్‌ అభిమానులకు అసలైన మజా ఇస్తున్న ఐపీఎల్‌ చివరి దశకు చేరుకుంది. నేటి ఫైనల్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపీయన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌‌ ఢీ కొట్టేందుకు సిద్ధమైంది. నాలుగు సార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌ మరోసారి ట్రోఫీని ముద్దాడాలని ఉరకలు వేస్తోంది. మరోవైపు తొలిసారి ఫైనల్‌కు చేరిన ఢిల్లీ.. ఒక్క సారైనా ట్రోఫీ గెలవాలని ఆరాటపడుతోంది. తామే కప్‌ గెలుస్తామని ఇరు జట్ల ఆటగాళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ముంబై ఆల్‌ రౌండర్‌ కీరన్‌ పోలార్డ్‌ మాట్లాడుతూ.. ప్రపంచకప్‌ ఫైనల్‌ తర్వాత క్రికెట్‌లో ఐపీఎల్‌ ఫైనలే అతి పెద్ద మ్యాచ్‌ అని అభిప్రాయపడ్డాడు. ఫైనల్‌ అనగానే సహజంగానే ఒత్తిడి ఉంటుందని, ఆటగాళ్లు అందరూ ఒత్తిడికి గురవుతారని పేర్కొన్నాడు. కానీ కప్‌ గెలవాలంటే సాధారణ మ్యాచ్‌గానే భావించాలని, ఎలాంటి తప్పులు జరగనివ్వద్దని ఆటగాళ్లకు సూచించారు. ప్రశాంతంగా గ్రౌండ్‌లో అడుగుపెట్టి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆడండి అంటూ పోలార్డ్‌ ఒక వీడియోలో సందేశమిచ్చాడు. ఈ  వీడియోని ముంబై ఇండియన్స్‌ అధికారిక ట్విట్టర్‌లో మంగళవారం సాయంత్రం పోస్టు చేసింది.

ముంబై ఇండియన్స్‌ ఇది వరకే 4 సార్లు (2013, 2015, 2017, 2019) సీజన్‌లో ట్రోఫీ కైవసం చేసుకుంది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫైనల్‌ చేరడం ఇదే మొదటిసారి. క్వాలిఫైయర్‌-2 లో సన్‌రైజర్స్‌ ను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఇక ఫైనల్‌ మ్యాచ్‌ గురించి ముంబై ఇండియన్స్‌ కోచ్‌ మహేల జయవర్దనే మాట్లాడుతూ.. ‘ఇది క్రికెట్ లో ఒక మ్యాచ్‌ మాత్రమే. దీని గురించి తాము ఎక్కువగా ఆలోచించడం లేదు. మేము ప్రయత్నాలని నమ్ముతూ, నైపుణ్యాలని అమలు చేయడానికి ప్రయత్నిస్తాం. ఇది బ్యాట్‌కి బంతికి, పరుగులకి వికెట్లకి మధ్య పోరాటం. కాబట్టి ఆ పోరాటాన్ని ఆస్వాదించడానికి  ప్రయత్నిస్తాం’ అని పేర్కొన్నాడు. మా జట్టులో కొందరి ఆటగాళ్లకు ఫైనల్‌ మ్యాచ్‌ ఆడిన అనుభవం ఉందని, క్లిష్ట సమయంలో ఎలా ఆడాలో వారికి తెలుసన్నారు. తుది పోరులో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు