ప్రాణ భయంతో నూతన జంట పరుగు.. వెంటాడి వేటాడి దారణం

26 Jun, 2021 17:44 IST|Sakshi

ఢిల్లీ: ఢిల్లీలోని ద్వారకా నగరంలో పరువు హత్య కలకలం రేపింది. పెద్దవాళ్లకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న జంటపై ఏడుగురు దుండగులు వారి ఇంట్లోకి చొరబడి చంపేందుకు ప్రయత్నించారు. ప్రాణభయంతో ఆ జంట తప్పించుకునే ప్రయత్నం చేయగా.. రోడ్డుపై వెంటాడి మరి తుపాకులతో కాల్చారు. ఈ దాడిలో యువకుడు చనిపోగా.. అతని భార్య ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నా  ఇంతవరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. 

డీసీపీ ఎస్‌కే. మీనా తెలిపిన వివరాల ప్రకారం.. సోనాపేటకు చెందిన వినయ్‌ దహియా, కిరణ్‌లు ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే వారి కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో వారం క్రితం ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తరపు కుటుంబసభ్యులు ఎలాగైనా వారిని చంపాలని నిర్ణయించుకున్నారు. దానికోసం పథకం వేసి కిరాయి అంతకులను మాట్లాడి వారు ఉంటున్న ప్రాంతం వివరాలు ఇచ్చారు. శుక్రవారం రాత్రి ఆఫీస్‌ పని ముగించుకొని ఇంటికి వచ్చిన వినయ్‌ తన భార్య కిరణ్‌తో కలిసి భోజనం చేస్తున్నాడు.

ఇదే సమయంలో వారు ఉంటున్న ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వచ్చిన అగంతకులు తుపాకీలతో కాల్పులు జరిపారు. వినయ్‌ శరీరంలోకి బులెట్లు దిగడంతో ప్రాణభయంతో అతను భార్యను వెంటబెట్టుకొని ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తాడు. కానీ అగంతకులు వారిని వెంటాడి మరీ కాల్పులు జరిపారు. దీంతో వినయ్‌ అక్కడికక్కడే మరణించగా.. కిరణ్‌ గట్టిగా కేకలు వేయడంతో అగంతకులు అక్కడి నుంచి పారిపోయారు. కాగా స్థానికులు వచ్చి వారిని దగ్గర్లోని వెంకటేశ్వర్‌ ఆసుపత్రిలో చేర్చారు. వినయ్‌ అప్పటికే మృతి చెందగా.. కిరణ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
చదవండి: బ్యాంకు సెక్యురిటీ గార్డు దారుణం.. మాస్కు ధరించలేదని కాల్చిపడేశాడు

మరిన్ని వార్తలు