100 మంది రైతులపై దేశ ద్రోహం కేసు

15 Jul, 2021 18:39 IST|Sakshi

నాలుగు రోజుల క్రితం హరియాణాలో చోటు చేసుకున్న ఘటన

న్యూఢిల్లీ: దేశద్రోహం చట్టంపై భారతదేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బ్రిటీష్‌ పాలన కాలం నాటి ఈ చట్టం స్వతంత్ర భారతదేశంలో అవసరమా అని సుప్రీంకోర్టు గురువారం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఓ వైపు దేశద్రోహం చట్టంపై నేడు సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయగా.. నాలుగు రోజుల క్రితం దాదాపు 100 మందిపై దేశద్రోహం కేసు నమోదయ్యింది. రైతులపై దేశ ద్రోహం కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ సంఘటన హరియాణాలో చోటు చేసుకుంది. బీజేపీ నాయకుడి వాహనంపై దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు అన్నదాతల మీద దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఆ వివరాలు..

కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దీర్ఘకాలంగా దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జూలై 11న హరియాణా రైతులు సిర్సాలో అధికార బీజేపీ-జేజేపీ కూటమి నేతలకు, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనకి దిగారు. ఈ క్రమంలో ఆ మార్గంలో వచ్చిన రాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌, బీజేపీ నాయకుడు రణ్‌బీర్‌ గంగ్వా వాహనాన్ని అడ్డుకున్నారు. దాంతో పోలీసులు రణబీర్‌ గంగ్వా అధికార వాహనాన్ని రైతులు అడ్డుకుని దాడికి ప్రయత్నించారని.. కారుని డ్యామేజ్ చేశారని ఆరోపిస్తూ అదే రోజున రైతు నేతలు హరిచరణ్‌ సింగ్‌, ప్రహ్లాద్‌ సింగ్‌తో పాటు 100 మంది అన్నదాతలపై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. 

ఈ ఘటనపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. హర్యానా రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వ సూచనల మేరకు.. రైతులు, రైతు నాయకులపై పోలీసులు చేసిన తప్పుడు, దేశద్రోహ ఆరోపణలను సంయుక్త కిసాన్ మోర్చా తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. రైతులపై నమోదయిన కేసును కోర్టులో సవాల్‌ చేయడానికి రైతులు, రైతు నాయకులందరికీ సంయుక్త కిసాన్ మోర్చా సహాయం చేస్తుందని పేర్కొంది.

మరిన్ని వార్తలు