Rajasthan Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి.. ప్రధాని, సీఎం దిగ్భ్రాంతి

31 Aug, 2021 11:27 IST|Sakshi

జైపూర్‌: రాజస్తాన్‌లోని నగౌర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బికనీర్‌-జోధ్‌పూర్‌ రహదారిలోని శ్రీ బాలాజీ టెంపుల్‌ సమీపంలో మంగళవారం ఈ ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వచ్చిన ఓ కారు‌, టక్కు పరస్పరం ఢీకొనడంతో 11 మంది మృత్యువాత పడ్డారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను బికనీర్‌లోని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితులంగా మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. రాజస్తాన్‌లోని రామ్‌దేవరా కర్నీ మాత దేవాలయాలను దర్శించుకొని తిరిగి ఇంటికి బయల్దేరిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
చదవండి: బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే కొడుకు, కోడలు మృతి 

ప్రమాద ఘటనపై రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో స్పందించారు. మధ్యప్రదేశ్‌కు తిరుగు ప్రయాణమైన 11 మంది యాత్రికులు నగౌర్‌లోని శ్రీబాలాజీ పట్టణం వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరం.. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి, ఈ కష్ట సమయంలో దేవుడు వారికి శక్తిని ప్రసాదించాలని, మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’అని గెహ్లాట్ పేర్కొన్నారు.

బాధితులకు నష్టపరిహారం
రాజస్తాన్‌ రోడ్డు ఘటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ స్పందించారు. ఈ ఘటన జరగడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షలు, గాయపడిన వారికి 50 వేల చొప్పున పీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు.  కాగా నాగౌర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 11 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ ఎక్స్ గ్రేషియా సహాయాన్ని ప్రకటించారు. అదే విధంగా క్షతగాత్రుల వైద్యానికి అవసరమయ్యే ఖర్చులను ప్రభుత్వం భరించనుందని వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు