ముంబైని ముంచెత్తిన వర్షాలు.. కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి

18 Jul, 2021 11:05 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు చెంబూరులో కొండచరియలు విరిగిపడి 17 మంది మృతిచెందారు. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెంబూరులోని భరత్‌నగర్‌ ప్రాంతంలో కొండచరియలు విరిగి పడటంతో గోడ కూలింది. దీంతో శిథిలాల కింద చిక్కుకుని 17 మంది దుర్మరణం పాలయ్యారు.  సమాచారం అందుకున్న అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల చిక్కుకున్నవారిలో ఇప్పటివరకు 13 మందిని నుంచి రక్షించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. గాయపడినవారికి చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. 

ముంబైను దంచికోడుతున్న భారీ వర్షాలు
దేశ ఆర్థిక రాజధాని ముంబై  వర్షాల కారణంగా అతలాకుతలమవుతోంది. కుండపోతగా కురుస్తున్న  వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రైల్వే ట్రాక్ పైన కూడా నీరు చేరడంతో, లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల ధాటికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముంబైలోని బంద‌ర్‌లో అత్యధికంగా 141 మి.మీ. వ‌ర్షపాతం న‌మోదైంది. ముంబై నగరంలో ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేయగా పుణె, రాయ్‌గ‌ఢ్‌, ర‌త్న‌గిరి, కోల్హాపూర్, స‌తారా జిల్లాల్లో రెడ్ అల‌ర్ట్ జారీ చేశారు. రాబోయే 24 గంట‌ల్లో ముంబైలో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు