పీపాలో నెల రోజులు.. మలం తిని బతికాడు

3 Feb, 2021 16:03 IST|Sakshi
వీడియో దృశ్యాలు

బ్రెసీలియా : కన్నతండ్రి, పిన తల్లి కర్కశత్వంతో ఓ బాలుడు నరకం అనుభవించాడు. పీపా(బ్యారెల్‌)లో బందీ అయి, తినడానికి సరైన తిండి లేక మలం తిని బ్రతికాడు. ఈ దారుణ సంఘటన బ్రెజిల్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. దక్షిణ బ్రెజిల్‌లోని జార్డిమ్‌ ఇటాటియాయాకు చెందిన పదకొండేళ్ల బాలుడ్ని అతడి తండ్రి, పినతల్లి బాల్కనీలోని పీపాలో బంధించి, చైన్లతో కట్టేశారు.

పీపాలోంచి బయటకు అడుగు పెట్టనిచ్చేవారు కాదు. తినడానికి కేవలం అరటి పండు తొక్కలు మాత్రమే ఇచ్చేవారు. దీంతో ఆకలికి తట్టుకోలేక తన మలాన్ని తిని బతికాడు. దాదాపు నెల రోజుల పాటు నరకం అనుభవించాడు. సరైన పోషకాహారం లేక బక్కచిక్కిపోయి చావుకు దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలో అతడి పరిస్థితి గమనించిన పొరిగింటి వారు పోలీసులకు సమాచారం అందించారు. ( 2వేల ఏళ్ల నాటి మమ్మీ: నోటిలో బంగారు నాలుక )

గత శనివారం అక్కడకు వెళ్లి చూసిన పోలీసులు షాక్ అయ్యారు. బాల్కనీలోని పీపాలో ఓ బాలుడు నగ్నంగా నిలుచుని ఉన్నాడు. పీపా చాలా వరకు మూత్రం, మలంతో నిండిపోయింది. అతడి శరీరం ఎముకల గూడును తలపిస్తోంది. పోలీసులు వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితికి కారణమైన తండ్రి, పినతల్లి, అక్క(పినతల్లి కూతురు)ని అరెస్ట్‌ చేశారు. నిందితులు దీనిపై మాట్లాడుతూ.. బాలుడి మానసిక పరిస్థితి బాగోలేదని, తమ పనులకు ఎప్పుడూ ఇబ్బంది కలిగిస్తున్నాడని చెప్పారు. అందుకే అతడ్ని పీపాలో ఉంచి చైన్‌తో కట్టేశామని తెలిపారు.

మరిన్ని వార్తలు