పంగోలిన్‌ చర్మాల స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టు

4 Aug, 2020 08:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: పంగోలిన్‌ చర్మానికి (అలుగు పొలుసులు) జాతీయ, అంతర్జాతీయ బ్లాక్‌ మార్కెట్లలో డిమాండ్‌ ఉండటంతో వాటిని అక్రమంగా సేకరించి అమ్మకానికి పెట్టిన అంతర్రాష్ట్ర ముఠా కుట్రను తెలంగాణ అటవీ శాఖ ఛేదించింది. సుమారు వారం రోజులపాటు అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ చేసిన అటవీ శాఖ అధికారులు, తామే కొనుగోలుదారుల అవతారమెత్తి మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ సహా కొత్తగూడెం, భద్రాచలం, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌లలో అధికారులు ఈ ఆపరేషన్‌ నిర్వహించారు. భద్రాచలం అటవీ ప్రాంతంలో గిరిజనులకు కొద్ది మొత్తం ఆశ చూపి, ఈ ముఠా అలుగు చర్మాలను సేకరిస్తోంది.

ముందుగా సమాచారం అందుకున్న కొత్తగూడెం అటవీ అధికారులు బాదావత్‌ రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతను ఇచ్చిన సమాచారంతో మూడు రోజులపాటు వివిధ ప్రాంతాల్లో నిఘాపెట్టి సునీల్, నాగరాజులతో పాటు మరో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని అటవీ, వన్యప్రాణుల సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టారు. ఈ ముఠాలో ఇంకా ముగ్గురు ఉన్నారని, వారు పరారీలో ఉన్నారని అధికారులు తెలిపారు. అంతరాష్ట్ర ముఠాలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఒరిస్సా, బెంగాల్‌ వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

పంగోలిన్‌ స్కేల్స్‌ (అలుగు పొలుసుల) వల్ల వివిధ రకాల ప్రయోజనాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. దీంతో వాటి పొలుసులకు బ్లాక్‌ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్‌ ఉంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో పొలుసులకు లక్షల్లో ధర పలుకుతున్నట్లు సమాచారం. ప్రస్తుత ముఠా నుంచి సుమారు నాలుగు కేజీల పొలుసులను అటవీ శాఖ స్వాధీనం చేసుకుంది. ఇందుకోసం మూడు నుంచి ఐదు జంతువులను దమ్మపేట అటవీ ప్రాంతంలో (కొత్తగూడెం) చంపిఉంటారని అధికారులు భావిస్తున్నారు. కొత్తగూడెం మెజిస్ట్రేట్‌ ముందు నిందితులను ప్రవేశపెట్టి, రిమాండ్‌కు తరలించారు. విచారణ కొనసాగుతోందని కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ అధికారి రంజీత్‌ నాయక్‌ తెలిపారు. కిన్నెరసాని వైల్డ్‌లైఫ్‌ ఎఫ్‌డీఓ దామోదర్‌రెడ్డి, హైదరాబాద్‌ విజిలెన్స్‌ డీఎఫ్‌ఓ రాజారమణారెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అధికారులు, సిబ్బందిని పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ ప్రత్యేకంగా ప్రశంసించారు. 

>
మరిన్ని వార్తలు