పూణెలో మహబూబ్‌నగర్‌ జిల్లా బాలుడిపై అఘాయిత్యం.. ఆపై

27 Mar, 2022 11:13 IST|Sakshi
మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు

పూణెలో చోటుచేసుకున్న ఘటన

స్వగ్రామైన పీర్లబండతండాలో విషాదం

సాక్షి, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా గండేడ్‌ మండలానికి చెందిన ఓ కుటుంబం పొట్ట కూటి కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్తే ప్రాణం తీశారు కొందరు. 13 ఏళ్ల దివ్యాంగ బాలుడిపై అత్యంత పాశవికంగా లైంగిక దాడి చేసి, ఆపై హత్య చేశారు. మృతదేహాన్ని గోనెసంచిలో ఉంచి చెత్తకుండీలో పడేసిన దారుణమైన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా.. శనివారం స్వగ్రామంలో బాలుడి అంత్యక్రియలు పూర్తయ్యాయి. వివరాలిలా.. గండేడ్‌ మండలంలోని పీర్లబండ తండాకు చెందిన ఓ దంపతులకు ముగ్గురు సంతానం.

ఇందులో వారి రెండో సంతానమైన బాలుడు కరణ్‌ (13) దివ్యాంగుడు (మూగ). దీంతో అతన్ని పాఠశాలకు పంపలేదు. ఈ దంపతులు 15 ఏళ్లుగా పూణెకు బతుకు దెరువుకోసం వెళ్లి కూలీనాలి చేసుకుంటుండేవారు. కరోనా కారణంగా రెండేళ్ల క్రితం సొంత గ్రామానికి వచ్చి, తిరిగి రెండు నెలల క్రితం పూణెకు సదరు బాలుడిని వెంట తీసుకొని వెళ్లారు. తల్లిదండ్రులు కూలి పనికి వెళితే ఈ బాలుడు ఇంటి వద్దే ఉండేవాడు. గురువారం రోజులాగే తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో బాలుడు ఇంటివద్దే ఉన్నాడు.

సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటి పక్కనే ఉన్న యూపీకి చెందిన పుంటి, మరొక వ్యక్తి కలిసి ఈ బాలుడిని బైక్‌పై ఓ ప్రాంతానికి తీసుకెళ్లి మరో ఇద్దరితో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బాలుడి చేతిని విరగ్గొట్టడంతో పాటు కణత, ముఖంపై తీవ్రంగా కొట్టారు. తమ లైంగిక వాంఛ తీర్చుకున్నాక అతడిని చంపారని కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. దుండగులు బాలుడి మృతదేహాన్ని గోనె సంచిలో తీసుకొచ్చి చెత్తకుండిలో వేస్తుండగా అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

సాయంత్రం పని నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కుమారుడు కనిపించకపోవడంతో వెతుకుతుండగా.. పోలీసులు ఈ విషయాన్ని వారికి తెలిపారు. వెళ్లి చూడగా తమ కుమారుడేనని గుర్తించి గుండెలవిసేలా రోదించారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. 

స్వగ్రామంలో అంత్యక్రియలు 
పూణె నుంచి శనివారం ఉదయం స్వగ్రామమైన పీర్లబండతండాకు బాలుడి మృతదేహాన్ని తల్లిదండ్రులు తీసుకొచ్చారు. బాలుడి మృతదేహాన్ని చూసి తండావాసుల కన్నీరుమున్నీరయ్యారు. తమ పొలంలో అంత్యక్రియలు నిర్వహించారు. ‘ ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని, బాధిత కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇవ్వడంతోపాటు అన్ని రకాలుగా ఆదుకుంటాం’ అని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి ఫోన్‌లో మహారాష్ట్ర డీజీపీతో మాట్లాడి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.  

మరిన్ని వార్తలు