ఘోరం: 14 మంది కోవిడ్‌ బాధితులు సజీవ దహనం

1 May, 2021 12:57 IST|Sakshi

గుజరాత్‌ కోవిడ్‌ సెంటర్‌లో అగ్ని ప్రమాదం,16 మంది మృతి

14 మంది కరోనా రోగులు, ఇద్దరు నర్సులు  దుర్మరణం

4 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం

సాక్షి, అహ్మదాబాద్‌: ఒకవైపు దేశంలో అడ్డు అదుపూ  లేకుండా కరోనా విజృంభిస్తోంది. మరోవైపు దేశంలో  కోవిడ్‌ ఆసుపత్రులలో  ప్రమాదాలు తీరని విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారుచ్‌లోని పటేల్‌ వెల్ఫేర్‌ కొవిడ్‌ హాస్పిటల్‌లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. వీరిలో 14 మంది కరోనా బాధితులు ఇద్దరు స్టాఫ్ నర్సులు ఉన్నారు.  మరో 50 మంది రోగులను స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారని అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఐసీయులో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. భారీగా వ్యాపించిన పొగ కారణంగా కోవిడ్‌ వార్డులో చికిత్స తీసుకుంటున్న వారు  ప్రాణాలు కోల్పోయారని భారుచ్‌ ఎస్పీ రాజేంద్ర సింహ్‌ తెలిపారు. ఇది చాలా దురదృష్టకరమైన  సంఘటన అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  

భరూచ్ ఆసుపత్రి అగ్ని ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు రాష్ట్రంలోని ఇద్దరు సీనియర్ ఐఎఎస్ అధికారులను వెంటనే భరూచ్ చేరుకుని సంఘటనపై దర్యాప్తు చేయాలని గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రుపానీ ఆదేశించారు. ప్రాణాలు కోల్పోయిన రోగులు, వైద్యులు ఆసుపత్రి సిబ్బందికి ఆయన సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున  4 లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటిసంచారు.

ప్రస్తుతం మంటలను అదుపులోకి వచ్చాయని, సుమారు 50 మంది రోగులను, స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారని పేర్కొన్నారు. క్షత గాత్రులందర్నీ సమీపంలో ఉన్న హాస్పిటల్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో మంటలు చెలరేగాయని అగ్నిమాపక శాఖ అధికారి శైలేష్‌ సంసియా తెలిపారు. భారుచ్‌-జంబుసర్‌ రహదారిపై ఉన్న నాలుగు అంతస్థుల భవనంలోని ఈ ఆసుపత్రిని  ఒక ట్రస్ట్‌ నిర్వహిస్తోంది. బాధితులు చాలామంది సజీవ దహనమైపోయారని, కొంతమంది రోగుల అవశేషాలు, స్ట్రెచర్లు  పడకలపై  పడి ఉన్నాయని ఆసుపత్రి ధర్మకర్త జుబెర్ పటేల్ కంటతడిపెట్టారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు