దారుణం: పోలీసుల దెబ్బలకు 17 ఏళ్ల బాలుడి మృతి!

22 May, 2021 11:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవో జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోవిడ్‌ నిబంధనలు అత్రికమించడనే కారణంతో పోలీసులు కొట్టిన దెబ్బలకు 17 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు బాలుడి మృతికి కారణమైన కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేయడంతోపాటు ఒక హోంగార్డును విధుల నుంచి తొలగించారు. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం మే 24 ఉదయం 7 గంటల వరకు రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూను విధించింది. ఈ క్రమంలో బంగర్‌మౌ పట్టణంలో మహ్మద్ ఫైసల్ అనే  17 ఏళ్ల బాలుడు శుక్రవారం మధ్యాహ్నం 3 తరువాత కర్ఫ్యూ సమయంలో మార్కెట్‌లో కూరగాయలు అమ్ముడుతున్నాడు.

ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు  కోవిడ్ ఆంక్షలను ఉల్లంఘించినందుకు పోలీసు విజయ్ చౌదరి, హోంగార్డ్ సత్యప్రదేశ్ బాలుడిని తీవ్రంగా కొట్టారు. పోలీసుల దాడిలో  బాధితుడు స్పృహ కోల్పోడంతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ అతని పరిస్థితి మరింత క్షీణించడంతో వైద్యం నిమిత్తం బంగార్‌మౌలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే బాలుడు మరణించాడని వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై బాధితుడి తండ్రి ఇస్లాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కొడుకును పోలీసులు కొట్టి చంపారని ఆరపిస్తూ ఉన్నవో పోలీస్‌ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేశాడు. అంతేగాక బాలుడి కుటుంబానికి పరిహారం చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మృతిచెందిన బాధితుడి బంధువులు, స్థానికులు నిరసన చేపట్టారు. ఈ విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు బాలుడి మృతికి కారణమయిన కానిస్టేబుల్‌ విజయ్‌ చౌదరిని, సస్పెండ్‌ చేసి హోంగార్డ్‌ సత్యను తొలగించామని ఉన్నవో  అదనపు పోలీస​ సూపరింటెండెంట్‌ శశి శేఖర్‌ తెలిపారు.

చదవండి: బ్యుటీషియన్‌పై అత్యాచారం.. నటి బాడీగార్డ్‌పై కేసు

మరిన్ని వార్తలు