ఆమెతో స్నేహం.. యువకుడి ప్రాణాలమీదకు

10 Oct, 2020 15:30 IST|Sakshi
మృతుడు రాహుల్‌ రాజ్‌పుత్‌ (కర్టెసీ: ఇండియా టుడే)

న్యూఢిల్లీ: చెల్లెలితో స్నేహం చేస్తున్నాడని పగబట్టిన ఓ అన్న 18 ఏళ్ల యువకుడిపై దాడి చేసి హతమార్చాడు. ఢిల్లీలోని ఆదర్శనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాహుల్‌ రాజ్‌పుత్‌ ఢిల్లీ యూనివర్సిటీలో ఓపెన్‌ విధానంలో డిగ్రీ రెండో ఏడాది చదువుతున్నాడు. వారు నివాసం ఉంటున్న ఆదర్శనగర్‌ ప్రాంతానికి చెందిన అమ్మాయితో గత రెండేళ్లుగా స్నేహంగా ఉంటున్నాడు. యువతి కుటుంబ సభ్యులు వారి ఫ్రెండ్‌షిప్‌పై పలుమార్లు అభ్యంతరం తెలిపారు.

ఈక్రమంలోనే యువతి అన్న గత బుధవారం రాహుల్‌ రాజ్‌పుత్‌ని నందా రోడ్డు వద్దకు పిలిచి గొడవకు దిగాడు. తన చెల్లితో స్నేహం ఆపాలంటూ మరో ముగ్గురితో కలిసి చితకబాదాడు. అనంతరం అక్కడ నుంచి జారుకున్నాడు. విషయం తెలుసుకున్న రాహుల్‌ కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. యువతి అన్న, అతని ముగ్గురు స్నేహితులను అరెస్టు చేశామని వాయువ్య ఢిల్లీ డీసీపీ విజయంత ఆర్యా పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నామని తెలిపారు.
(చదవండి: ప్రాణాలు తీసిన ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ..)

పోస్టుమార్టం నివేదికలో రాహుల్‌కు అంతర్గతంగా తీవ్ర గాయాలయ్యాయని తేలిందని వెల్లడించారు. రాహుల్‌ ప్లీహానికి చీలిక రావడంతో మరణం సంభవించిందని డాక్టర్లు చెప్పినట్టు డీసీపీ తెలిపారు. ఇది రెండు కుటుంబాల మధ్య ఘర్షణ మాత్రమేనని.. దీనిపై ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసి ఉద్రిక్తతలు రెచ్చగొట్టొద్దని హెచ్చరించారు. కాగా,  తొలుత కేసు నమోదు చేయడంలో పోలీసులు జాప్యం చేశారని రాహుల్‌ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దాడి విషయం తెలియగానే.. నిందితులపై కేసు నమోదు చేయాలని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తే తమ మాట వినిపించుకోలేదని అన్నారు. రాహుల్‌ ఒంటిపై చిన్న గాయమైనా లేదని కేసు నమోదు చేయలేదని చెప్పారు. తమ బిడ్డ ప్రాణాలు గాల్లో కలిసిపోయాక పోలీసులు కళ్లు తెరిచారని విమర్శించారు.
(చదవండి: పూజ చేయొద్దని మహిళపై దాడి)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు