సినిమా కోసం హీరోల మేకల దొంగతనం

11 Nov, 2020 16:28 IST|Sakshi

చెన్నై : దొంగలందు ఈ దొంగలు వేరయా.. నిజమే ఇది చదివితే మీకే అర్థమవుతుంది. తండ్రి నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాతో హీరోలుగా మారాల్సిన ఆ ఇద్దరు అన్నదమ్ములు దొంగల అవతారమెత్తి జైలు పాలయ్యారు. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నైలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చెన్నై, న్యూ వాషర్‌మెన్‌ పేటకు చెందిన విజయ్‌ శంకర్‌ అనే వ్యక్తి సొంతంగా ‘ నీ దాన్‌ రాజా’ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో అతడి కుమారులు వి.నిరంజన్‌ కుమార్‌(30), లెనిన్‌ కుమార్‌(32)లు హీరోలుగా నటిస్తున్నారు. అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగా సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా సినిమా పూర్తి చేయాలని భావించారు ఇద్దరు అన్నదమ్ములు. ఇందుకోసం దొంగతనాలకు సిద్ధపడ్డారు. జన సంచారం తక్కువ ఉండే గ్రామాలైన చెంగల్‌పేట్‌, మాదవరం, మింజూర్‌, పొన్నెరి గ్రామాల్లో మేతకు వెళ్లిన మేకల గుంపులను లక్ష్యంగా చేసుకునేవారు. ( అర్నబ్‌ కేసు: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు)

పట్టుబడకుండా ఉండేందుకు అందులో నుంచి ఒకటి, రెండు మేకలను దొంగలించేవారు. ఈ క్రమంలో అక్టోబర్‌ 9న మాదవరం పలనిలో మేక దొంగతనం జరిగింది. మందలో 6 మేకలు ఉండడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవి వీడియోల ఆధారంగా సోదరులిద్దరూ ఈ పని చేసినట్లుగా గుర్తించారు. వారిద్దరూ ఒక కారులో వచ్చినట్టు కనిపించగా, కారు నెంబరు గుర్తించలేకపోయారు. చివరకు పోలీసులే వేషాలు మార్చి, సాధారణ జనాల్లో కలిసిపోయి గమనించసాగారు. శనివారం రోజున ఆ సోదరులు నిద్రిస్తున్న మేకను దొంగలిస్తుండగా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు