సిగ్నల్‌ వద్ద బ్రేక్‌ బదులు ఎక్స్‌లేటర్‌ తొక్కడంతో..ఇద్దరు మృతి

8 Feb, 2023 09:21 IST|Sakshi
ప్రమాద దృశ్యం, మృతులు మజీద్‌, అయ్యప్ప

సాక్షి, శివాజీనగర: బెంగళూరు నృపతుంగ రోడ్డులో బీజేపీ ఎమ్మెల్యే హరతాళు హాలప్ప కుమార్తె ప్రయాణి స్తున్న కారు ఢీకొని ఇద్దరు మృతి చెందగా నలుగురు గాయపడిన ఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు... యలహంక న్యూటౌన్‌కు చెందిన మోహన్‌ కారు నడుపుతున్నాడు. కారులో ఎమ్మెల్యే కుమార్తె డాక్టర్‌ సుష్మిత ఉన్నారు. కిమ్స్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆమెను డ్రైవర్‌ మోహన్‌ డ్యూటీకి తీసుకెళుతున్నాడు.

కోర్టు కాంప్లెక్స్‌ వద్దకు వచ్చి హడ్సన్‌ సర్కిల్‌ ఎడమ వైపునకు తిరిగేందుకు ప్రయత్నించగా సిగ్నల్‌ పడింది. దీంతో వేగంగా వచ్చిన మోహన్‌ రెండు కార్లు, మూడు ద్విచక్ర వాహనాలకు ఢీకొన్నాడు. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరు మృతి చెందారు. మృతులను హెచ్‌బీఆర్‌ లేఔట్‌కు చెందిన మజీద్‌ ఖాన్‌ (36) కే.జీ.హళ్లికి చెందిన అయ్యప్ప (60)లుగా గుర్తించారు.   

సిగ్నల్‌ వద్ద బ్రేక్‌ బదులు ఎక్సలేటర్‌ తొక్కి.. 
సిగ్నల్‌ వద్దకు రాగానే బ్రేక్‌ వేయకుండా ఎక్సలేటర్‌పై కాలుపెట్టడంతో ప్రమాదం జరిగిందని డ్రైవర్‌ మోహన్‌ పోలీసుల ముందు తప్పు ఒప్పుకొన్నాడు. పోలీసులు అతని వాంగ్మూలన్ని రికార్డు చేసుకున్నారు. వాహనం నడిపే సమయంలో మోహన్‌ ఫోన్‌లో ఏమైనా మాట్లాడుతున్నాడా అనే విషయంపై సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేఏ 50 ఎంఏ 6600 నంబర్‌ కలిగిన కారుపై ఎమ్మెల్యే హాలప్ప పేరున్న స్టిక్కర్‌ అంటించి ఉంది. ఈ కారు యలహంకకు చెందిన రాము సురేశ్‌ అనే వ్యక్తి పేరు మీద ఉంది. ఇతను ఎమ్మెల్యేకు చెందిన మనిషిగా భావిస్తున్నారు. డ్రైవర్‌  ర్యాష్‌గా వాహనాన్ని నడుపుకుంటూ రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.    

ఎమ్మెల్యే స్టిక్కర్లను ఉపయోగించటం నేరం: 
ప్రమాదానికి కారణమైన ఇన్నోవాకు ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉంది. రాజకీయ నాయకులు ఉపయోగించని వాహనాలపై ఎమ్మెల్యే స్టిక్కర్‌లను ఉపయోగించటం చట్ట వ్యతిరేకం.  
హలసూరు గేట్‌ స్టేషన్‌లో కేసు: 
డ్రైవర్‌ మోహన్‌ను ఆల్కోమీటర్‌ పరీక్షించగా మద్యం సేవించలేదని తేలిందని డీసీపీ (ట్రాఫిక్‌) కళా కృష్ణస్వామి తెలిపారు. హలసూరు గేట్‌ ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.  

(చదవండి: ఇటీవలే పెళ్లి, అంతలోనే ఆత్మహత్య )

మరిన్ని వార్తలు