అయ్యో పాపం.. ఆశలు అడియాశలయ్యాయి

27 Jan, 2021 09:45 IST|Sakshi

పాఠశాలకని వెళ్లి.. విగత జీవులయ్యారు

పాలేటిలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి

కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు

రెండు గ్రామాల్లో విషాద ఛాయలు  

పీసీపల్లి:  గణతంత్య్ర దినోత్సవం రోజున హుషారుగా పాఠశాలకని వెళ్లిన పిల్లలు సెలవు రోజని సరదాగా ఈతకు వెళ్లి వాగులో మునిగి విగత జీవులుగా మారిన ఘటన పీసీపల్లి మండలం బట్టుపల్లి సమీపంలో ఉన్న పాలేటివాగు వద్ద మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, మృతుల కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ఏరువారిపల్లి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ కనిగిరి మండలం వాగుపల్లి గ్రామానికి చెందిన సాలమ్మ రవీంద్ర కుమారుడు ముప్పూరి లక్ష్మీనారాయణ (14) 9వ తరగతి, కొత్త ఏరువారిపల్లి గ్రామానికి చెందిన మేకల శ్రీదేవి, గురవయ్యల కుమారుడు మేకల కార్తీక్‌ (13) 8వ తరగతి చదువుతున్నారు. గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైస్కూల్‌కు వచ్చిన వారు కార్యక్రమంలో పాల్గొని మిఠాయిలు తిని.. వారికి పోటీల్లో వచ్చిన బహుమతులతో సంతోషంగా గడిపారు.

సెలవు రోజు కావడంతో సరదాగా ఈతకు వెళ్దామంటూ 20 మంది మిత్రులతో కలిసి పాలేటివాగు దగ్గరకు వచ్చారు. ముందు మీరు నీళ్లలోకి దూకి లోతు చూడటమంటూ తోటి విద్యార్థులు ప్రోత్సహించడంతో లక్ష్మీ నారాయణ, మేకల కార్తీక్‌ వాగులోకి దూకారు. ఎక్కువ లోతు ఉండటం, ఈత రాకపోవడం, నీరు ప్రవహిస్తుండటంతో లోతైన చోటుకు జారుకుంటూ పోయి అడుగుకు వెళ్లిపోయారు. వారు ఎంతకూ బయటకు రాకపోవడంతో భయంతో ఒడ్డున ఉన్న తోటి విద్యార్థులు పరిగెత్తుకుంటూ ఊరులో అందరికీ చెప్పి తీసుకొచ్చారు. పోలీసులకు సమాచారం అందించడంతో  పీసీపల్లి ఎస్సై ప్రేమకుమార్, మరో నలుగురు గత ఈతగాళ్లతో స్వయంగా వాగులో దిగి వెతికి ఆ పిల్లలిద్దరినీ బయటికి తీశారు. అప్పటికే ఇద్దరూ మృతి చెందారు. గ్రామస్తులు విగత జీవులైన పిల్లలను చూసి బోరుమంటూ విలపిస్తున్నారు.

పనికెళ్లి డబ్బులు తెస్తా.. బాగా చదువుకో బిడ్డా.. 
సాలమ్మ, రవీంద్ర దంపతులకు లక్ష్మీనారాయణ ఒక్కగానొక్క కుమారుడు కావడంతో కూలి పనులు చేసుకొని కొడుకును చదివిద్దామని తండ్రి రవీంద్ర సోమవారం రాత్రి బేల్దారు పని కోసం హైదరాబాద్‌ వెళ్లాడు. అయితే మంగళవారం కొడుకు వాగులో పడి చనిపోయాడని తెలియడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఇంటికి బయలు దేరాడు.

ఆశలు అడియాశలయ్యాయి..
మేకల కార్తీక్‌ తండ్రి గురవయ్య వికలాంగుడు కావడంతో తల్లి శ్రీదేవి కూలి పనికి వెళ్లి కొడకును బాగా చదివించాలని తపించింది. కష్టపడి పనిచేస్తూ కొడుకును పోషిస్తోంది. కుమారుడి మరణంతో ఆశలు అడియాశలై ఆ తల్లిదండ్రులు గుండెపగిలేలా విలపిస్తున్నారు. లక్ష్మీనారాయణ, కార్తీక్‌ మృతదేహాలను కనిగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని కనిగిరి సీఐ వెంకటేశ్వరరావు పరిశీలించారు. బాధితులను అడిగి వివరాలు సేకరిస్తున్నారు. ఎస్పై ప్రేమకుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అనుమానంతో భార్యను హతమార్చిన భర్త అరెస్టు 
అద్దంకి: భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టి చంపిన ఘటనలో నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు దర్శి డీఎస్పీ ప్రకాశరావు చెప్పారు. కేసు వివరాలను మంగళవారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. డీఎస్పీ కథనం మేరకు మండలంలోని ధర్మవరం గ్రామానికి చెందిన బత్తుల పోలయ్యకు రుక్మిణమ్మ (50)తో 33 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు మగపిల్లలు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్లలందరికీ వివాహాలయ్యాయి. భార్యా భర్తలు, వారి పెద్ద కుమారుడు రమేశ్‌ ఒకే ఇంట్లో కలసి ఉంటుంటారు. రుక్మిణమ్మ పొలం పనులకు వెళుతూ ఉంటుంది. పోలయ్య వ్యవసాయం చేస్తూ మేకలను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో కొంత కాలం నుంచి పోలయ్యకు తన భార్య రుక్మిణమ్మ మీద అనుమానం ఏర్పడింది. తనతో సరిగా మాట్లాడటం లేదని, వివాహేతర సంబంధం నెరుపుతుందనే అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై తరచూ భార్యతో గొడవ పడుతూ, కొడుతూ తిడుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో గత సంవత్సరం డిసెంబరు నెల 16వ తేదీన భార్యతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గొడవపడి, పిల్లలు ఆడుకునే క్రికెట్‌ బ్యాట్‌తో భార్య తల మీద కొట్టగా ఆమె మృతిచెందిందని డీఎస్పీ వివరించారు. పెద్ద కుమారుడు రమేశ్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం నిందితుడు పోలయ్యను అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు.  సమావేశంలో సీఐ ఆంజనేయరెడ్డి, ఎస్సై వీ మహేశ్‌ ఉన్నారు. 

క్వారీల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు 

  • ఈర్లకొండలో క్వారీలను పరిశీలించిన మైన్స్‌ అండ్‌ సేఫ్టీ డిప్యూటీ డైరక్టర్‌ వై.యోహాన్‌ 

బల్లికురవ: గ్రానైట్‌ క్వారీలో నిబంధనలు, భద్రతా చర్యలను తప్పకుండా పాటించాలని, వాటిని అతిక్రమిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవని మైన్స్‌ అండ్‌ సేఫ్టీ ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కడప జిల్లాల డిప్యూటీ డైరక్టర్‌ యరజర్ల యోహాన్‌ హెచ్చరించారు. మండలంలోని కొణిదెన రెవెన్యూలోని ఈర్లకొండ ఇంపీరియల్‌ క్వారీలో ఆదివారం సాయంత్రం బ్లాస్టింగ్‌ రాయి ఎగిసిపడి తమిళనాడు కార్మికుడు యం.ఆర్ముగం చనిపోయిన ప్రాంతాన్ని, బ్లాస్టింగ్‌ చేపట్టిన శ్రీరాఘవేంద్ర, గిరిజా క్వారీలను మంగళవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. క్వారీ నుంచి వచ్చిన బ్లాస్టింగ్‌ రాయిని పోలీసులు స్వాధీనం చేసుకోగా బల్లికురవ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి రాయిని పరిశీలించి స్వా«దీన పరుకున్నారు. క్వారీల మ్యాపు బ్లాస్టింగ్‌ రాయి పరీక్షలతో ఏ క్వారీ నుంచి రాయి వచ్చిపడిందో పది రోజుల్లో తేల్చి శాఖ పరంగా ఆ క్వారీపై చర్యలు తీసుకుంటామని డీడీఎంఎస్‌ తెలిపారు.   

బ్లాస్టింగ్‌లో కోఆర్డినేషన్‌ ఉండాలి..డీడీఎంఎస్‌ 
క్వారీదారులు నిబంధనలు పాటిస్తూ బ్లాస్టింగ్‌ చేసేటప్పుడు పక్క క్వారీలతో కోఆర్డినేషన్‌ ఉండాలని డీడీఎంఎస్‌ వై.యోహన్‌ అన్నారు.   ఇంపీరియల్‌ క్వారీలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. క్వారీలో మేనేజర్, మేట్‌లు విధులు బాధ్యతలు గుర్తెరిగి అప్రమత్తతతో ఉంటే ఇలాంటి ప్రమాదాలు సంభవించవన్నారు. గ్రానైట్‌ క్వారీలకు పక్కనే కోట్లు  వెచ్చించి నిర్మించిన రోడ్లను ధ్వంసం చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఆయన అనుచరులకు సంబంధించి బల్లికురవ ఈర్లకొండ, గురిజేపల్లి కొండ, చీమకుర్తి 12 క్వారీల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించి పనులు నిలుపుదల చేశామని, రాళ్లు తరలించినా పనులు చేసినా క్వారీలనే సీజ్‌ చేస్తామని ఆయన హెచ్చరించారు. విలేకర్ల సమావేశంలో మైనింగ్‌ ఏడీ బండి జగన్నాథరావు, సర్వేయర్‌ రవితేజ వీటీసీ సెక్రటరీభాస్కర్‌రెడ్డి , గిరిరాజ్‌ క్వారీ యజమాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు