దుర్గానగర్‌ జంక్షన్‌ వద్ద ప్రమాదం

23 Feb, 2021 20:06 IST|Sakshi
ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ర్యాష్‌ డ్రైవింగ్‌, బైకర్‌కు గాయాలు

సిగ్నల్‌ జంప్‌ చేసిన వాహనాలు ఢీ

ర్యాష్‌ డ్రైవింగ్‌ ప్రమాదకరం

దుర్గానగర్‌ జంక్షన్‌ వద్ద ప్రమాదాలు

కారు నంబర్‌ బైక్‌కు పెట్టుకున్న యువకుడు

మైలార్‌దేవ్‌పల్లి: సిగ్నల్‌ జంప్‌ చేసిన రెండు వాహనాలు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. చంద్రయాణగుట్ట నుంచి వస్తున్న స్వరాజ్‌ మజ్డా వాహనం బంజారాహిల్స్‌ వెళ్తుంది. కాటేదాన్‌ నుంచి వస్తున్న ఆటో చంద్రయాణగుట్ట వైపు వెళ్తుంది. ఈ ఆటోలో డ్రైవర్‌ అర్మాజ్‌(19)తో పాటు మహ్మద్‌ గౌస్‌(20) ప్రయాణిస్తున్నాడు. ఈ రెండు వాహనాలు దుర్గానగర్‌కు వచ్చే సమయానికి రెడ్‌ సిగ్నల్‌ పడింది. ఇరువురు డ్రైవర్లు నిర్లక్ష్యంగా సిగ్నల్‌ జంప్‌ చేయడంతో వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటు ప్రయాణికుడు గాయపడ్డారు. స్వరాజ్‌ మజ్డా డ్రైవర్‌ దావూద్‌(55) పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ డ్రైవర్‌ అర్మాజ్‌ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కారు నంబరు బైక్‌కు పెట్టుకుని
కొత్తూరు: చలానాలు తప్పించుకోవడంలో భాగంగా కొందరు ఇటీవల కాలంలో ఒక వాహనం రిజిస్ట్రేషన్‌ నంబర్‌ మరో వాహనానికి వేసుకోవడం పరిపాటిగా మారింది. తీరా చాలానాలు వచ్చే దాక విషయం తెలియడం లేదు. ఇలాంటి ఘటనే మండలంలో సోమవారం వెలుగులోకి వచ్చింది.  గూడూరు గ్రామానికి చెందిన పెండ్లిమడుగు విజయనిర్మల పేరు మీద మారుతి బ్రిజాకారు ఉంది. కాగా ఇదే నెంబర్‌ను ఓ యువకుడు బైకుకు పెట్టుకున్నాడు. 

ఈ నెల 17న షాద్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌లో యువకుడు హెల్మెట్‌ ధరించని కారణంగా ట్రాఫిక్‌ పోలీసులు బైకు ఫొటోను తీసి చలానా వేయడంతో కారు యజమానురాలికి మెసేజ్‌ వచ్చింది. దీంతో తనది కారు అయినప్పటికీ బైకు చలానా ఎందుకు వచ్చిందని ట్రాఫిక్‌ ఎస్‌ఐ రఘుకుమార్‌ను వివరణ కోరగా తప్పుడు నంబర్‌ ప్లేట్లు పెట్టుకున్నట్లు తేలితే వాహనం యజమానిపై క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామన్నారు. బ్రీజా కారు నంబర్‌ను బైకు పెట్టుకున్న విషయాన్ని విచారిస్తామన్నారు. 

ర్యాష్‌ డ్రైవింగ్‌ ప్రమాదకరం
నిర్లక్షంగా వాహనం  నడిపి ఓ వ్యక్తి గాయపడేలా చేశాడో బైకర్‌. ట్రాఫిక్‌ సిగ్నల్‌ను సమీపిస్తున్న సమయంలో  ర్యాష్‌గా డ్రైవ్‌ చేసి ప్రమాదానికి కారణమయ్యాడు. మైలార్‌దేవపల్లి, దుర్గానగర్‌ జంక్షన్‌ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ట్విటర్‌లో షేర్‌ చేశారు. నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు