అందివచ్చిన కొడుకులు అందని లోకాలకు..

12 Aug, 2021 08:37 IST|Sakshi

అనకాపల్లి టౌన్, మునగపాక:  ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు సరదాగా ఒకే కారులో అనకాపల్లి పట్టణానికి వచ్చారు.  కాసేపు ఉల్లాసంగా గడిపి అర్ధరాత్రి సమయంలో తిరిగి వెళుతుండగా కారు అదుపుతప్పి వేగంగా   విద్యుత్‌స్తంభాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందగా.. మరో యువకుడు  తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి  ట్రాఫిక్‌ ఎస్‌ఐ రమేష్‌ అందజేసిన వివరాలు ఇలా ఉన్నాయి మునగపాక మండలం తోటాడ గ్రామానికి చెందిన అప్పికొండ కుమారస్వామి (25), రాయవరపు ఈశ్వరరావు(18), దొడ్డి త్రినాథ్‌ (25) ముగ్గురూ  స్నేహితులు. వీరిలో కుమారస్వామి ఒక ప్రైవేటు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

బుధవారం ఒక శుభ కార్యానికి కారు బుక్‌ కావడంతో పెట్రోలు కొట్టించేందుకు అతను కారు (ఏపీ39టీవీ5868)లో ఇద్దరు స్నేహితులను తీసుకొని మంగళవారం సాయంత్రం 6.30 ప్రాంతంలో సమీపంలోని అనకాపల్లి పట్టణానికి వచ్చారు. పెట్రోలు కొట్టించిన అనంతరం ఒక డాబాలో భోజనం చేసి కాసేపు సరదాగా గడిపారు.  అర్ధరాత్రి సమయంలో తిరిగి వారు గ్రామానికి వెళుతుండగా కారు అదుపుతప్పి  మున్సిబుమదుం వద్ద విద్యుత్‌ స్తంభాన్ని వేగంగా  ఢీకొట్టారు. దీంతో కారు నడుపుతున్న  కుమారస్వామి, పక్కన కూర్చున్న ఈశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందారు.

వెనక కూర్చున్న త్రినాథ్‌ తీవ్రంగా గాయపడడంతో అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం తెలిసిన వెంటనే ట్రాఫిక్‌ ఎస్‌ఐ రమేష్‌ సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. మృతుడు ఈశ్వరరావు సోదరుడు బాలాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
తోటాడలో పెను విషాదం 
ఎంతో భవిష్యత్తు ఉన్న ముక్కుపచ్చలారని యువకులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తోటాడలో పెను విషాదం అలముకుంది.    అండగా ఉంటారనుకుంటున్న తరుణంలో వారు శాశ్వతంగా దూరంకావడంతో ఆ కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి. అందరితో సరదగా కలిసి మెలిసి ఉండే స్నేహితుల్లో ఇద్దరు మృతిచెందడం.. మరొకరు మృత్యువుతో పోరాడుతుండడంతో తోటాడ ఒక్కసారిగా మూగబోయింది. 
అండ కోల్పోయిన టైలర్‌ కుటుంబం  
తోటాడ గ్రామానికి చెందిన అప్పికొండ రమణమూర్తి, రాజ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. రమణమూర్తి టైలరింగ్‌ చేసుకుంటూ కుటుంబాన్ని  పోషిస్తున్నాడు. అయితే  గత కొంతకాలంగా అతను పక్షవాతంతో బాధపడుతూ ఇబ్బందులు పడుతున్నారు.  అతని  చిన్నకుమారుడు కుమారస్వామి కారు డ్రైవర్‌గా పనిచేయడంతోపాటు స్థానికంగా జ్యూస్‌ షాపు నిర్వహిస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉన్నాడు. ఈ సమయంలో అతను మృతిచెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 
కాలేజీకి వెళ్లాల్సిన తరుణంలో.. 
రాయవరపు అప్పారావు, మౌనిక దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు ఈశ్వరరావు(18)  ఇంటర్‌ మొదటి సంవత్సరం పాస్‌ అయ్యాడు. మరో నాలుగు రోజుల్లో ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. అప్పారావు నాయీ బ్రాహ్మణ వృత్తి ద్వారా    కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఎంతో చురుకైన చిన్న కుమారుడు  చదువులో రాణించి తమ కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెడతాడని ఆశించారు. ఈ తరుణంలో తమకు దేవుడు అన్యాయం చేశాడని ఈశ్వరరావు తల్లితండ్రులు విపపించడం అందరినీ కంటతడిపెట్టించింది. 

మరిన్ని వార్తలు