లైంగికదాడి కేసులో ఇద్దరికి 20 ఏళ్లు జైలు

8 Sep, 2022 04:03 IST|Sakshi
నిందితులు ఎల్లన్న, శివకళాధర్‌

కర్నూలు (లీగల్‌): యువతిపై లైంగిక దాడి కేసులో ఇద్దరికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ ఏడవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి బుధవారం తీర్పు చెప్పారు. కేసు వివరాల ప్రకారం... కర్నూలు తాలూకా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రామచంద్రానగర్‌కు చెందిన ఒక యువతి (23) తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో సోదరి సహాయంతో 2016, డిసెంబర్‌లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది.

ఆమె తిరిగి ఇంటికి వెళ్లగా, మానసిక స్థితి సరిగా లేని తన తండ్రి కనిపించలేదు. దీంతో తమ కుటుంబానికి పరిచయస్తుడైన ఎల్లన్న(30) వద్దకు వెళ్లి తన తండ్రి గురించి అడిగింది. ‘మీ తండ్రి డోన్‌ రోడ్డు వైపు వెళ్లాడు. తీసుకువద్దాం పదా..’ అని ఆ యువతిని ఎల్లన్న తన బైక్‌పై ఎక్కించుకుని దూరంగా ముళ్లపొదల వైపు తీసుకువెళ్లి ఆపాడు. అక్కడకు శివకళాధర్‌(32) అనే వ్యక్తి వచ్చి తాను పోలీసునని బెదిరించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఆ తర్వాత ఎల్లన్న కూడా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసు విచారణలో యువతిపై ఇద్దరు లైంగిక దాడికి పాల్పడినట్లు రుజువైంది. దీంతో ఎల్లన్న, శివకళాధర్‌కు 20 ఏళ్లు కఠిన కారాగారశిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జి.భూపాల్‌రెడ్డి తీర్పు చెప్పారు. జరిమానా మొత్తాన్ని ఫిర్యాదికి ఇవ్వాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు