సామూహిక అత్యాచారం కేసులో ఇద్దరికి 20 ఏళ్ల జైలు

10 Aug, 2023 04:40 IST|Sakshi

సత్ఫలితాలనిస్తున్న కన్విక్షన్‌ బేస్డ్‌ పోలీసింగ్‌ విధానం: డీజీపీ 

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి గుణపాఠం: బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్‌

సాక్షి, అమరావతి/ గుంటూరు లీగల్‌/నగరంపాలెం: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన రేపల్లె రైల్వేస్టేషన్‌లో జరిగిన  సామూహిక అత్యాచారం కేసులో ఇద్దరు ముద్దాయిలకు 20 సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కొక్కరికీ రూ.2,500 జరిమానా విధిస్తూ నాలుగో అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి ఆర్‌.శరత్‌బాబు బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం మండలం, వెంకటాద్రిపురానికి చెందిన కొర్రపోలు రమేష్‌ వ్యవసాయ, తాపీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య ఏసమ్మ, ముగ్గురు పిల్లలు సంతానం కాగా, భార్య మళ్లీ గర్భంతో ఉంది.

కృష్ణాజిల్లా నాగాయలంకలో కూలి పనులు చేసుకునేందుకు రమేష్‌ తన భార్య, పిల్లలతో 2022 ఏప్రిల్‌ 30న గుంటూరులో రైలు ఎక్కి రేపల్లె వెళ్లాడు. అప్పటికి సమయం 11.45 కావడంతో రైల్వేస్టేషన్‌లోనే తన భార్య, పిల్లలతో రమేష్‌ నిద్రకు ఉపక్రమించాడు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పాలుబోయిన విజ యకృష్ణ, పలుచూరి నిఖిల్,  మరో మైనర్‌ బాలు డు మద్యం మత్తులో రైల్వేస్టేషన్‌లోకి వచ్చారు. అక్కడ భార్య,పిల్లలతో నిద్రిస్తున్న రమేష్‌ను నిఖిల్‌ నిద్రలేపి టైం అడిగాడు. టైం చెప్పకపోవడంతో రమేష్‌ను కొట్టడం ప్రారంభించాడు. దీంతో రమేష్‌ స్టేషన్‌ బయటకు పరుగెత్తాడు.

అక్కడే ఉన్న రమేష్‌ భార్యపై విజయకృష్ణ లైంగికదాడికి పాల్పడ్డాడు. రమేష్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లి పోలీసులను తీసుకొచ్చేసరికి నిందితులు పారిపోయారు. నిందితులు తన భార్యపై సామూహిక అత్యాచారం చేసినట్లు రమేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రేపల్లె డీఎస్పీ టి.మురళీకృష్ణ, దిశ డీఎస్పీ యు.రవిచంద్ర దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరఫున స్పెషల్‌ పీపీ శారదమణి వాదించారు. ఈ కేసులో మూడో ముద్దాయి మైనర్‌ కావడంతో తెనాలి పోక్సో కోర్టులో విచారణ జరుగుతుంది.        
          
సత్ఫలితాలనిస్తున్న కన్విక్షన్‌ బేస్డ్‌ పోలీసింగ్‌
అత్యాచార కేసుల్లో దోషులకు సత్వరం శిక్షలు విధించేలా పోలీసు శాఖ కోర్ట్‌ ట్రయల్‌ మానిటరింగ్‌ విధానాన్ని సమర్థంగా అమలు చేస్తున్నదని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి చెప్పారు. బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్‌లో గతేడాది ఓ మహిళపై అత్యాచారం చేసిన కేసులో పాలుబోయిన విజయకృష్ణ, పాలుచురి నిఖిల్‌ను దోషులుగా గుర్తిస్తూ న్యాయస్థానం 20 ఏళ్లు జైలు శిక్ష విధించడం కేసు దర్యాప్తులో  పోలీసుల సమర్థతకు నిదర్శనమన్నారు. కన్విక్షన్‌ బేస్డ్‌ పోలీసింగ్‌ ద్వారా గతేడాది కాలంగా గుర్తించిన 122 కేసుల్లో 102 కేసుల్లో దోషులకు శిక్షలు పడ్డాయన్నారు. ముగ్గురికి మరణశిక్ష, 37మందికి జీవిత ఖైదు, 62 కేసుల్లో 7 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష  పడిందన్నారు.

ఈ తీర్పు ఓ గుణపాఠం..
రేపల్లె రైల్వేస్టేషన్‌లో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఇచ్చిన తీర్పు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఓ గుణపాఠమని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్‌ తెలిపారు.  గుంటూరు జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలోని స్పందన హాల్‌లో బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు.

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బాధితురాలికి తక్షణ సాయంగా రూ.10 లక్షలు, ఎస్‌సి, ఎస్‌టి కేసు కింద రూ.8.50 లక్షలు, ఎంపీ, ఎమ్మెల్యే నుంచి రూ.1.50 లక్షలు అందజేసినట్లు చెప్పారు. కాగా, ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేసి, నిందితులకు శిక్షలు పడే వరకు ప్రతిభ కనబరిచిన స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శారదామణి, డిప్యూటీ డైరెక్టర్‌ ప్రాసిక్యూషన్‌ మధుసూదనరావు, తదితర పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు, రివార్డులు అందజేశారు.
 

మరిన్ని వార్తలు