ఆ ఇద్దరిని కఠినంగా శిక్షించాలి అదే నా చివరి కోరిక.. వీడియో క్లిప్పింగుల కలకలం

18 Aug, 2022 13:18 IST|Sakshi

తూర్పు గోదావరి: మండలంలోని నీలపల్లికి చెందిన యువతి ఐదు రోజుల క్రితం అదృశ్యమైందని, కేసు నమోదు చేసి ఆచూకీ కోసం గాలిస్తున్నామని కోరంగి ఎస్సై టి.శివకుమార్‌ బుధవారం తెలిపారు. ఎం.ఎస్‌.శర్మ దంపతుల 22 ఏళ్ల కుమార్తె ఈ నెల 13వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది.

ఇంటినుంచి వెళుతూ యువతి రాసిన సూసైడ్‌ నోట్‌ తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేస్తోంది. ఇద్దరి యువకుల వేధింపుల వల్ల మనోవేదనకు గురై తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ నోట్‌లో పేర్కొంది. యానాం గోదావరిలోగాని, కోరంగి గోదావరిలో గాని దూకి తాను చనిపోతానని, తన కోసం గాలించవద్దని తెలిపింది. దీంతో యువతి తండ్రి ఆందోళన చెందుతూ యానాం, కోరంగి గోదావరి ప్రాంతాలలో తీవ్రంగా గాలించి, ఆచూకీ లభించకపోవడంతో కోరంగి పోలీసులకు 13 తేదీన ఫిర్యాదు చేశారు. 

కలకలం రేపుతున్న వీడియో క్లిప్పింగులు 
సోషల్‌ మీడియాలో ఒక యువకుడు ఆ యువతి ఫొటోలను తగులబెడుతూ, ఆమె చనిపోకపోతే నేనే చంపేస్తానని చెప్పడం కలకలం రేపుతోంది. ఆ యువకుడు ఎవరు, సూసైడ్‌ నోట్‌లో యువతి పేర్కొన్న ఇద్దరి పేర్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్‌నోట్‌లో గోదావరిలో దూకి చనిపోతానని పేర్కొనడం, కొంతమంది గోదావరి పరీవాహక ప్రాంతంలో యువతిని చూసినట్లుగా చెప్పడంతో గోదావరిలో విస్తృతంగా గాలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

సూసైడ్‌నోట్‌లో పేర్కొన్న ఇద్దరినీ కఠినంగా శిక్షించాలని, అదే నా చివరి కోరిక అని యువతి పేర్కొంది. కాగా తమ కుమార్తెను ఆ ఇద్దరు యువకులే కిడ్నాప్‌ చేసి ఉంటారని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌కు, పోలీసు ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేసినట్లు వారు తెలిపారు. తమకు ఇద్దరు పిల్లలని మూడేళ్ల వయసులోనే కాలువలో పడి తమ కుమారుడు మృతి చెందాడని, తమకు అండగా ఉంటుందనుకున్న కుమార్తె ఈ రకంగా కనిపించకపోవడంపై కన్నీటి పర్యంతమవుతున్నారు. 

మరిన్ని వార్తలు