కారు డాష్‌బోర్డులో 25 కేజీల బంగారు కడ్డీలు..

25 Mar, 2021 07:00 IST|Sakshi

25 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ సిబ్బంది

విలువ రూ.11.63 కోట్లు

గౌహతి నుంచి హైదరాబాద్‌కు అక్రమరవాణ

కారులోని డ్యాష్‌బోర్డులో దాచి ఉంచిన నిందితులు 

పంతంగి టోల్‌ప్లాజా వద్ద అరెస్టు

సాక్షి, హైదరాబాద్‌ /చౌటుప్పల్‌: అస్సాం నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు పట్టుకున్నారు. బంగారం అక్రమ రవాణాపై ముందస్తు సమాచారం అందు కున్న డీఆర్‌ఐ అధికారులు హైదరాబాద్‌ శివారు లోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద మంగళవారం తెల్లవారుజామున మాటువేశారు. అస్సాం రిజిస్ట్రేషన్‌తో గౌహతి, పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా మీదుగా దాదాపు 2,500 కిలోమీటర్లు ప్రయాణించిన ఇసూజు (ఎస్‌యూవీ) వాహనం పంతంగి టోల్‌ప్లాజాకు రాగానే అధికారులు దాన్ని చుట్టుముట్టారు.

అందులో ప్రయాణిస్తున్న వినోద్‌కుశ్వ, విజయ్‌గోయెల్, సత్యవీర్‌సింగ్‌ అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. ఈక్రమంలో వాహనం డ్యాష్‌బోర్డులో ఎయిర్‌బ్యాగులను తొలగించగా.. అందులో ఫెవీక్విక్‌తో మూసివేసిన ఓ అరను గుర్తించారు. దాన్ని తొలగించగా.. అధికారులకు రూ.11.63 కోట్ల విలువైన 25 కిలోల బంగారు కడ్డీలు బయటపడ్డాయి. ఒక్కో కడ్డీ కిలో బరువుండగా...వాటిపై హెరాస్, సుసీ, మెల్టర్‌ అసాయెర్, వాల్కాంబీ తదితర విదేశీ కంపెనీల ముద్రలున్నాయి. కేసు నమోదు చేసిన అధికారులు ముగ్గురిని అరెస్టు చేసి, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. 
చదవండి: రూ. 50 కోట్లు ముంచేసి.. రాత్రికి రాత్రే పరార్‌

మరిన్ని వార్తలు