6 నెలల క్రితం కులాంతర వివాహం.. ఇంటికి తిరిగొస్తే పంచాయతీ పెట్టి..

4 Aug, 2021 00:26 IST|Sakshi

భువనేశ్వర్‌: సమాజంలో ఎన్ని మార్పులు వస్తున్నా కులాంతర వివాహాలను మాత్రం చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ఒడిశాలోని కియోంఝర్‌ జిల్లాలోని నియలిజరాన్ గ్రామానికి చెందిన గిరిజన యువకుడు మహేశ్వర్ బాస్కే అదే గ్రామంలో ఇతర కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరి వివాహాన్ని ఆ గ్రామ పెద్దలు, గ్రామస్థులంతా వ్యతిరేకించడమే కాక చంపుతామని బెదిరించారు. దీంతో ఆ జంట గ్రామాన్ని వదిలి వెళ్లిపోయారు.

అయితే ఇటీవల లాక్‌డౌన్‌ కారణంగా పట్టణాల్లో పనులు లేక  తిరిగి అదే గ్రామానికి రావడంతో గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టారు. కులాంతర వివాహం చేసుకొని తప్పు చేసినందుకు గానూ, రూ.25 లక్షల భారీ జరిమానా కట్టాలని తీర్పు ఇచ్చారు. అంతేకాక ఆ జరిమానా చెల్లించే వరకు వారికి ఎవరూ సహాయం చేయకూడదని, కనీసం నీళ్లు కూడా ఇవ్వకూడదని  గ్రామస్తులకు షరతు విధించారు. దీంతో అంత పెద్ద మొత్తంలో జరిమానా కట్టలేక ఆ జంట పోలీసులను ఆశ్రయించింది.

మహేశ్వర్ మాట్లాడుతూ: ప్రస్తుతం మహేశ్వర్ తన భార్య, తల్లితో కలిసి ఊరు బయట ఉన్న తన మేనమామ ఇంట్లో ఉండాల్సి వస్తోందనీ, అంత పెద్ద మొత్తం జరిమానా తాము గ్రామ పెద్దలకి చెల్లించలేమని, తమని గ్రామంలోకి అనుమతించడానికి సాయం చేయాలని కోరుతున్నారు.

ఇక ఇదే విషయంపై ఆనంద్ పూర్ కోర్టు దర్యాప్తుకి ఆదేశించింది. తాము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని స్థానిక ఘాసీపుర స్టేషన్ ఇన్స్పెక్టర్ మనోరంజన్ వెల్లడించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు