ఢిల్లీలో బాలికపై వ్యక్తి అఘాయిత్యం

28 Jul, 2021 17:08 IST|Sakshi

న్యూఢిల్లీ: బాలికకు కొత్త బట్టలు కొనిస్తానని నమ్మించి బయటకు తీసుకెళ్లిన ఓ వ్యక్తి బట్టలు ఇప్పించకుండా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన కూతురి వయసు ఉన్న బాలికను రైలు పట్టాల సమీపంలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఇంట్లో వారికి చెప్పొద్దని బెదిరించాడు. ఇంటికొచ్చిన బాలిక ముభావంగా ఉండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన 27 ఏళ్ల ఓ వ్యక్తి ఢిల్లీలోని షాలిమార్‌ బాగ్‌లో నివసిస్తున్నాడు. ఈ ఆదివారం (జూలై 25) ఓ వస్తువు కొనేందుకు ఇంటికెళ్లి బయటకు వచ్చిన తొమ్మిదేళ్ల బాలికను అతడు పరిచయం చేసుకున్నాడు. బాలికను మాటల్లోకి దించి నీకు కొత్త దుస్తులు కొనిస్తానని చెప్పి నమ్మించాడు. మాయ మాటలను నమ్మిన బాలిక అతడి వెంట వెళ్లింది. శాంతి అనే ప్రాంతానికి తీసుకెళ్లి రైలు పట్టాల సమీపంలో బాలికపై బలత్కారం చేశాడు. 

అనంతరం ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు. బాలిక విచిత్రంగా ప్రవర్తించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఆమె అత్యాచారానికి గురయ్యిందని తెలిపారు. వెంటనే కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సీసీ ఫుటేజీ పరిశీలించగా అతడి ఆచూకీ లభించింది. వాజీర్‌పూర్‌ ప్రాంతంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ ఉష రంగనాని తెలిపారు. ఆ వ్యక్తి పలు కర్మాగారాల్లో స్వీపర్‌గా పని చేసేవాడని తెలిసింది. అతడిపై పలు కేసులు నమోదై ఉన్నాయి. స్వగ్రామం రాంపూర్‌లో ఉన్నప్పుడు కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రి నుంచి తప్పించుకుని ఢిల్లీ చేరాడు. దీనిపై అజీమ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. 

మరిన్ని వార్తలు