యూ ట్యూబ్‌ నేర్పిన పాఠాలు 

21 Sep, 2022 03:04 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ చందనాదీప్తి   

నకిలీ కరెన్సీ ముద్రించి చెలామణి  

నిందితుడి అరెస్టు 

రూ. 3.16 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం 

అన్నా చెల్లెలి నయా దందా 

రాంగోపాల్‌పేట్‌: యూ ట్యూబ్‌ ద్వారా నకిలీ కరెన్సీ తయారీని నేర్చుకుని వాటిని ముద్రించి చెలామణి చేస్తున్న వ్యక్తిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.3.16లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసికున్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితురాలైన యువతి  పరారీలో ఉంది. మంగళవారం ఏసీపీ సుధీర్‌తో కలిసి డీసీపీ చందనా దీప్తి వివరాలు వెల్లడించారు. నారాయణపేట్‌ జిల్లా, కోస్గికి చెందిన కస్తూరి రమేష్‌ బాబు గత కొద్ది నెలలుగా బండ్లగూడ జాగీర్‌ కాళీమందిర్‌ ప్రాంతంలో సోదరి రామేశ్వరితో కలిసి ఉంటూ కార్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు.

గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అతను యూ ట్యూబ్‌లో నకిలీ కరెన్సీ ముద్రణపై తెలుసుకున్నాడు. తన సోదరి రామేశ్వరికి కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండటంతో ఇద్దరు కలిసి నకిలీ కరెన్సీ తయారు చేయాలని పథకం వేశారు. ఇందుకుగాను ల్యాప్‌ట్యాప్, ప్రింటర్లు, పేపర్‌ కట్టింగ్‌ మిషన్‌తో పాటు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేశారు. ఇద్దరు కలిసి రూ.100, 200, 500 నోట్లను ముద్రించారు. ముద్రించిన నకిలీ కరెన్సీని కొందరు ఏజెంట్లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.   

పట్టుబడిందిలా..: నాచారంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే సాట్ల అంజయ్య  తండ్రి అనారోగ్యానికి గురికావడంతో డబ్బు అవసరం కలిగింది. యూ ట్యూబ్‌ ద్వారా రమేష్‌ బాబును సంప్రదించి రూ.50వేలు చెల్లించి రూ.1.30 లక్షల విలువైన నకిలీ నోట్లను తీసుకున్నాడు. ఇందులో కొన్ని చలామణీ చేయగా మరికొంత మొత్తం మిగిలి ఉంది. వీటిని చెలామణి చేసేందుకు అంజయ్య ఈ నెల 19న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చి రామస్వామి అనే ఫుట్‌పాత్‌ వ్యాపారి వద్ద పండ్లు కొనుగోలు చేసి రూ.200 నకిలీ నోటు ఇచ్చాడు.

ఇది నకిలీదని గుర్తించిన అతను గోపాలపురం పోలీ సులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని అదే రోజు రిమాండ్‌కు తరలించారు. అంజయ్య ఇచ్చిన సమాచారంతో రమేష్‌ బాబును అరెస్టు చేయగా, అతడి సోదరి రామేశ్వరి తప్పించుకుంది. వారి నుంచి ప్రింటింగ్‌ సామగ్రి, కారు స్వాధీనం చేసుకున్నారు.  

రూ.5వేల నోట్లు కూడా : నిందితులు రూ.100, 200, 500 నోట్లే కాకుండా రూ.2000, రూ.5వేల నోట్లు కూడా ముద్రించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రూ.5వేల నోట్లను రిజర్వు బ్యాంకు ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ముద్రిస్తుంది. వాటి నమూనాలు కూడా స్కాన్‌ చేసి ల్యాప్‌టాప్‌లో ఉంచుకున్నారు. దీని ఆధారంగా వాటిని కూడా ముద్రించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.  

మాల్‌ హై హోనా క్యా.... 
యూ ట్యూబ్‌లో నకిలీ కరెన్సీకి సంబంధించిన అనేక వీడియోలు ఉన్నాయి. వాటి కింద నిందితులు మాల్‌ హై హోనా క్యా అంటూ కామెంట్‌ చేసి తమ ఫోన్‌ నంబర్‌ ఇచ్చేవారు. ఇలాగే ఈ కేసులో నిందితుడు కూడా వీరిని సంప్రదించాడు. వారిని హైదరాబాద్‌కు పిలిపించుకుని నకిలీ నోట్లు విక్రయించే వారు.  
2021 నుంచే ముద్రణ...లక్షల్లో చెలామణి నిందితులు 2021 కరోనా తర్వాత నుంచి నకిలీ కరెన్సీని ప్రింట్‌ చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.80లక్షల మేర నకిలీ కరెన్సీ చేతులు మారి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు