విషాదం: పండుగకు ఇంటికెళ్తూ.. అనంతలోకాలకు...

12 Apr, 2021 03:08 IST|Sakshi
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మురళీమోహన్‌రెడ్డి, సుజాత, నేహా (ఫైల్‌) 

లారీని ఓవర్‌టెక్‌ చేయబోయి బొలెరోను ఢీకొన్న కారు 

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి దుర్మరణం  

మరో నలుగురికి తీవ్ర గాయాలు  

అతి వేగమే ప్రమాదానికి కారణం

సాక్షి, ఎర్రవల్లిచౌరస్తా (అలంపూర్‌): ఇతర కుటుంబ సభ్యులతో కలసి సంతోషంగా ఉగాది పండుగ చేసుకుందామని కారులో స్వగ్రామానికి బయలుదేరారు. ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి డివైడర్‌ను దాటి.. అవతలి రోడ్డులో వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల మండలం ఎర్రపల్లకు చెందిన మురళీమోహన్‌రెడ్డి (45) కొన్నేళ్లుగా హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో నివాసం ఉంటూ వ్యాపారం చేస్తున్నారు. ఈయనకు భార్య సుజాత (40), కుమార్తె నేహారెడ్డి (12), కుమారుడు సాయితేజారెడ్డి ఉన్నారు. ఉగాది పండుగ కోసమని ఆదివారం ఉదయం కారులో స్వగ్రామానికి నలుగురూ బయలుదేరారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం స్టేజీ సమీపంలోకి చేరుకోగానే హైవేపై ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్‌ చేయబోయారు. దీంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి పల్టీలు కొట్టి అవతలి రోడ్డులో అనంతపురం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బొలెరోను ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు నుజ్జునుజ్జు కాగా వాటిలో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మురళీమోహన్‌రెడ్డి మృతి చెందారు. భార్య సుజాత, కుమార్తె నేహారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రస్తుతం కుమారుడు సాయితేజారెడ్డితో పాటు బొలెరోలో ప్రయాణిస్తున్న సునీల్, రాజు, సత్యం చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలాన్ని కోదండాపురం ఎస్‌ఐ కృష్ణయ్య పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. కారు అతివేగంతో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనతో తల్లి, తండ్రి, సోదరిని కోల్పోయిన సాయితేజారెడ్డి ఏకాకిగా మారాడు.

మరిన్ని వార్తలు