మిత్రుడి విడిదే ఐడియా ఇచ్చింది! 

15 Jul, 2021 08:07 IST|Sakshi

దాన్ని చూసే హాస్టళ్ల టార్గెట్‌

స్పోర్ట్స్‌ బైక్స్‌ దొంగల వ్యవహారం

పోలీసు కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్‌

సాక్షి, హైదరాబాద్‌: ఓన్లీ స్పోర్ట్స్‌ బైక్స్‌నే టార్గెట్‌గా చేసుకుని హైదరాబాద్‌తో పాటు నల్లగొండ జిల్లాలో 12 రోజుల్లో 8 ద్విచక్ర వాహనాలను కొట్టేసిన అంతర్రాష్ట్ర ముఠా విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. హాస్టళ్ల వద్ద ఉన్న వాహనాలను తస్కరించాలనే ఆలోచన తన స్నేహితుడు, గ్యాంగ్‌ మెంబర్‌ విడిది చేసిన హాస్టల్‌ వద్ద పరిస్థితిని చూసిన తర్వాతే వచ్చిందని ప్రధాన సూత్రధారి బయటపెట్టాడు. ముగ్గురినీ జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించిన పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి అప్పగించాల్సింగా కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు.

► గుంటూరు జిల్లా నరసరావుపేట వాసి శివనాగ తేజ కుందన్‌బాగ్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడి స్నేహితులైన గుంటూరు జిల్లా వాసులు చందు, మధు మద్యం, జల్సాల కోసం ఇతడి వద్దకు వచ్చేవాళ్లు. 
► జల్సాలకు అవసరమైన డబ్బు కోసం ఈ ముగ్గురూ కలిసి నేరాలు చేయాలని భావించారు. గత నెల మూడో వారంలో నగరంలో సమావేశమైన ఈ త్రయం వివిధ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించింది.
► తేజ ఉంటున్న హాస్టల్‌లో పార్కింగ్‌ సదుపాయం లేకపోడంతో అందులో ఉండే వాళ్లు తమ వాహనాలను రోడ్డు పక్కనే పార్క్‌ చేసేవాళ్లు. ఇది చూసిన ఈ త్రయం హాస్టల్స్‌ వద్ద బైక్స్‌నే చోరీ చేయాలని నిర్ణయించుకుంది.
► వాళ్లు వాడే స్పోర్ట్స్‌ బైక్స్‌ ఎలా తస్కరించాలో తెలుసుకోవడానికి యూట్యూబ్‌లో సెర్చ్‌ చేశారు. అల్యూమినియంతో తయారైన వాటి హ్యాండిల్‌ను కాలితో తేలిగ్గా విరగ్గొట్టవచ్చని, ఫ్యూజుల్లో పిన్నీసు పెట్టి వాహనం స్టార్ట్‌ చేయొచ్చని నేర్చుకున్నారు. 
► పిడుగురాళ్ల నుంచి రాత్రి బస్సులో బయలుదేరే చందు, మధు తెల్లవారుజామున నగరానికి చేరుకునే వాళ్లు. ఆ రోజు అర్ధరాత్రి వరకు మద్యం తాగి మరుసటి రోజు తెల్లవారుజామున 2.30– 3 గంటల మధ్య వాహనం తస్కరించే వాళ్లు. 
► చందు, శివ ఓసారి మద్యం కోసం నల్లగొండ జిల్లాలో తెలంగాణ– ఏపీ సరిహద్దుల్లోని వాడపల్లికి బస్సులో వచ్చారు. తిరిగి వెళ్లడానికి అవసరమైన డబ్బునూ మద్యానికే వాడేశారు. తమ స్వస్థలాలకు చేరడానికి అక్కడో బైక్‌ తస్కరించారు.  
►ఈ చోరులను పట్టుకోవడంతో ఆసిఫ్‌నగర్‌ క్రైమ్‌ కానిస్టేబుళ్లు శ్రీకాంత్, రామకృష్ణలు దాదాపు 100 సీసీ కెమెరాల్లో రికార్డైన ఫీడ్‌ పరిశీలించారు. అందులో దొరికిన క్లూతో ముగ్గురినీ సోమవారం అరెస్టు చేశారు.
►వీరిపై వాడపల్లిలోనూ ఓ కేసు నమోదై ఉంది. దీంతో ఈ త్రయం అరెస్టుపై అక్కడి పోలీసులకు ఆసిఫ్‌నగర్‌ అధికారులు సమాచారం ఇచ్చారు. త్వరలో వాళ్లు పీటీ వారెంట్‌పై ఈ ముగ్గురినీ అరెస్టు చేసి తరలించనున్నారు. 

మరిన్ని వార్తలు