బస్తర్‌లో అనూహ్య ఎన్‌కౌంటర్‌: ముగ్గురు గిరిజనులు మృతి

17 May, 2021 18:46 IST|Sakshi

ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని బస్తర్ అటవీ ప్రాంతంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయానికి తోడు పోలీసులు-నక్సలైట్ల మధ్య ఘర్షణ సామాన్య ప్రజానీకం ప్రాణాలను బలితీసుకుంటున్నది. బీజాపూర్ జిల్లా సిల్గర్ పోలీసు బేస్ క్యాంపు వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఆదివాసీ గిరిజనులు మరణించారు. గత నెలలో మావోయిస్టులు పోలీసులపై భీకర దాడికి పాల్పడిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే తాజాగా ఈ సంఘటన జరిగింది. ఎన్‌కౌంటర్ వార్తలను బస్తర్ రేంజ్ ఐజీ పి సుందరరాజ్ నిర్ధారించారు.

వివరాల్లోకి వెళ్తే.. గత నెలలో ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత మరింత అప్రమత్తమైన బలగాలు కేంద్ర, రాష్ట్ర ఆదేశాలకు అనుగుణంగా వ్యూహాత్మక ప్రాంతాల్లో కొత్త క్యాంపులు ఏర్పాటు చేశారు. ఏప్రిల్ నుంచి సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, డీఆర్జీకి చెందిన జవాన్లు అడవిలో ఉమ్మడిగా సెర్చ్ ఆపరేషన్లు చేపడుతున్నాయి. అలా కొత్తగా ఏర్పాటైన ఓ క్యాంపుపైన నేడు మధ్యాహ్నం మావోయస్టులు దాడి చేశారు. ఈ క్రమంలో ఈ అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి.

బస్తర్ రీజియన్ లోని బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లో గల సిల్గర్ ప్రాంతంలో భద్రతా బలగాలు ఇటీవలే కొత్త క్యాంపును ఏర్పాటు చేశాయి. గత నెల జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని వారి ఏరివేత లక్ష్యంగా కొత్త క్యాంప్ నుంచి బలగాలు ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి. కొంత కాలంగా ఇటు పోలీసులు, అటు నక్సలైట్ల మధ్య నలిగిపోతున్న స్థానిక  ఆదివాసీ గిరిజనులు.. క్యాంపును అక్కడి నుంచి ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ మే 14 నుంచి మూడు రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం కూడా సిల్గర్ వద్దకు గిరిజనులు భారీ ఎత్తున వచ్చారు. 

ఈ విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు గిరిజనులకు నచ్చ చెప్పి ఆందోళన కార్యక్రమాలు విరమింపచేశారు. తిరిగి ఈ రోజు వేలాది మంది పోలీసు శిబిరం వద్దకు చేరుకున్నారు. పోలీస్ క్యాంపు వద్ద నిరసన చేస్తున్న క్రమంలో అందులో కొందరు పోలీసు శిబిరంపై దాడికి పాల్పడ్డారు. దీంతో తిరిగి పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు గ్రామస్తులు మృతి చెందారు. ఆదివాసీల మాటు నుంచి నక్సల్స్ పోలీసు శిబిరంపై కాల్పులు జరిపినట్లు బస్తర్ రేంజ్ ఐజీ పి సుందరరాజ్ తెలిపారు. ప్రస్తుతం సిల్గర్ పోలీసు శిబిరం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసు బలగాలను భారీగా తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

చదవండి:

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇంట్లో మహిళ ఆత్మహత్య

మరిన్ని వార్తలు