అత్తింటి పోరుకు బావిలో శవాలైన ముగ్గురు అక్కాచెళ్లెళ్లు, ఇద్దరు చిన్నారులు.. కారణం?

28 May, 2022 17:52 IST|Sakshi

జైపూర్‌: ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది సామెత.. కానీ అందుకు భిన్నంగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు అత్తారింట్లో మాత్రం గెలవలేకపోతున్నారు. ప్రపంచాన్ని జయించగలుగుతున్న నారీమణులు ఇంట్లో అత్తామామల పోరుకు బలైపోతున్నారు. కట్నం, అదనపు కట్నం వివాదాల్లోనే సగం మంది మహిళల జీవితాలు గతించిపోతున్నాయి. వరకట్న వేధింపులకు ఎంతో మంది ఆత్మహత్య, హత్యలకు గురవుతున్నారు. తాజాగా కట్న దాహానికి అయిదు నిండు ప్రాణాలు బలయ్యాయి. మృతుల్లో గర్భిణిలు, చిన్నారులు ఉండటం మరింత కలిచివేసే విషయం. ఈ అమానుష ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.

జైపూర్‌ జిల్లాలోని డుడు ప్రాంతంలో శనివారం ముగ్గురు మహిళలతో సహా అయిదుగురు మృతదేహాలను బావిలో నుంచి వెలికి తీశారు. ఇందులో ఇద్దరు అభం శుభం తెలియని చిన్నారులున్నారు. అలాగే మహిళల్లో ఇద్దరు ప్రస్తుతం గర్భిణీలు. ముగ్గురు మహిళలు కాలు దేవి(27), మమతా(23) దేవి, కమలేష్‌(20) అక్కాచెల్లెల్లుగా గుర్తించారు. నాలుగేళ్ల చిన్నారి, 27 రోజుల శిశువును కాలుదేవి పిల్లలుగా గుర్తించారు. ముగ్గురు అక్కాచెల్లెల్లు బాల్య వివాహ బాధితులే. పెద్దగా చదువుకోని, మద్యం అలవాటు ఉన్న ముగ్గురు అన్నదమ్ములతో వీళ్ల వివాహాలు జరిగాయి. ముగ్గురు సోదరీలు గృహసింసకు గురవుతున్నట్లు  తెలిసింది.

చిన్న సోదరి కమలేష్‌ ఏడాది వయసున్నప్పుడే కాలుదేవికి 2003లో బాల్య వివాహం జరిగింది. ఉన్నతంగా జీవించాలని ఆశపడ్డ ముగ్గురూ.. చాలా కష్టపడి చదువుకున్నారు. వీరిలో మమత పోలీస్‌ కానిస్టేబుల్‌ పరీక్షకు ఉత్తీర్ణత సాధించింది. పెళ్లైన తర్వాత కూడా చదవును కొనసాగిస్తున్న కాలు ప్రస్తుతం బీఏ చదువుతోంది. ఎనిమిది నెలల గర్భవతి అయిన చిన్న చెల్లెలు కమలేష్‌ కూడా సెంట్రల్‌ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తోంది.  కాలు దేవిని అత్తామామలు కొట్టడంతో 15 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవలే ఇంటికి తిరిగొచ్చింది.

అయితే  కాలు తన ఇద్దరు పిల్లలతోపాటు మమతా, కమలేష్‌ అయిదుగురు మార్కెట్‌కు వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి కనిపించకుండా పోయారు. బుధవారం మిస్సింగ్‌ కేసు నమోదవ్వగా.. శనివారం విగతజీవులుగా తేలారు. ఇంటికి సమీపంలోని రెండు కిలోమీటర్ల దూరంలోని బావిలో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు సోదరులు నర్సి, గోరియో, ముఖేష్‌లను అరెస్టు చేశారు. మహిళలు, వారి పిల్లలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారా లేక వరకట్న వేధింపులతో భర్తలు, అత్తమామలే హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: భర్తకు దూరంగా భార్య.. అనుమానాస్పద మృతి.. మరిదే కారణమంటూ..

మరిన్ని వార్తలు