అయ్యో బిడ్డా! నువ్వు లేవనే నిజాన్ని ఎలా జీర్ణించుకోమంటావురా తండ్రి

19 Jan, 2022 09:00 IST|Sakshi
 మృతదేహాల వద్ద గుండెలు పగిలేలా రోదిస్తున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు 

సాక్షి, కోటపల్లి(చెన్నూర్‌): ‘‘అయ్యో బిడ్డా.. చేతికందివచ్చిన నువ్వు మాకు చేదోడుగా ఉంటావనుకుంటే నిన్ను ప్రాణహిత నది పొట్టనపెట్టుకుందా.. కోటి ఆశలతో పెంచుకున్న నువ్వు మాకు లేవనే నిజాన్ని ఎలా జీర్ణించుకోమంటావురా తండ్రి..’’ అంటూ ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆలుగామ గ్రామ సమీపంలోని ప్రాణహిత నదిలో గ్రామానికి చెందిన విద్యార్థులు అంబాల విజేందర్‌సాయి(16), వంశీవర్ధన్‌(18), గారె రాకేశ్‌(20) సోమవారం సరదాగా స్నానానికి వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. సోమవారం నుంచి గాలింపు చర్యలు చేపట్టగా మంగళవారం ఇద్దరి మృతదేహాలు లభించాయి. మరొకరి ఆచూకీ లభించలేదు. 

పెద్ద వలతో గాలింపు..
గజ ఈతగాళ్లు, సింగరేణి రెస్క్యూ టీం స్పీడ్‌ బోట్‌తో మంగళవారం గాలింపు చేపట్టారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో చెన్నూర్‌ రూరల్‌ సీఐ నాగరాజు మండలంలోని వెంచపల్లి, రాచర్ల, జనగామ గ్రామాలకు చెందిన మత్స్యకారులను పిలిపించారు. 20 మంది దండెంగ(పెద్ద వల)తో నాటుపడవల సహాయంతో నదిలో గాలింపు చేపట్టారు. మొదట అంబాల విజయేందర్‌సాయి మృతదేహాం వలకు చిక్కింది. 20 నిమిషాల తర్వాత వంశీవర్ధన్‌ మృతదేహం లభ్యమైంది. దీంతో వారి తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఇద్దరి మృతదేహాలకు డాక్టర్‌ విజిత్‌ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. 
చదవండి: ప్రియుడితో పిజ్జాహట్‌కు.. మొదటి భార్యతో కలిసి వీడియో రికార్డింగ్‌ 

సహాయక చర్యల పర్యవేక్షణ
గాలింపు చర్యలను ఆర్డీవో వేణు, జైపూర్‌ ఏసీపీ నరేందర్‌ పర్యవేక్షించారు. సింగరేణి రెస్క్యూ టీం, స్థానిక జాలర్లను సమన్వయం చేస్తూ మత్స్యకారులకు ఎప్పటికప్పుడు సలహాలు ఇచ్చారు. గాలింపు చర్యలు వేగవంతానికి అవసరమైన వాటిని సమకూర్చారు.

కొనసాగుతున్న గాలింపు
మరో విద్యార్థి గారె రాకేశ్‌ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇద్దరు విద్యార్థులు విగతజీవులై కనిపించడంతో రాకేశ్‌ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తమ కొడుకు ఆచూకీని ఎలాగైనా కనిపెట్టాలని విలపిస్తున్న తీరు అక్కడున్న వారిని కదిలించింది. మంగళవారం సాయంత్రం చీకటి పడే వరకు గాలింపు చర్యలు చేపట్టినా రాకేశ్‌ ఆచూకీ లభించలేదు. దీంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. 
చదవండి: వైద్యుని ఆత్మహత్య వెనుక హనీట్రాప్‌.. నగ్నచిత్రాలను పంపి వీడియోకాల్‌

మాజీ ఎమ్మెల్సీ పరామర్శ
విజయేందర్‌సాయి, వంశీవర్ధన్‌ మృతదేహాలు లభ్యం కాగా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌ నివాళులు అర్పించారు. మృతుల తల్లిదండ్రులను పరామర్శించి దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం చేశారు. ఆయన వెంట ఎంపీపీ మంత్రిసురేఖా, వైస్‌ ఎంపీపీ వాల శ్రీనివాసరావు, సర్పంచ్‌ కుమ్మరి సంతోశ్, గట్టు లక్ష్మణ్‌గౌడ్, జెల్ల సతీశ్, పున్నంచంద్, సత్యనారాయణరావు, ఎంపీటీసీలు తిరుపతి, శేఖర్, జెడ్పీకోఆప్షన్‌ అజ్గర్, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ సాంబగౌడ్, నాయకులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు