ప్రాణం తీసిన సెల్ఫీ మోజు 

3 Feb, 2021 08:16 IST|Sakshi

లారీ దూసుకెళ్లి ముగ్గురు మహిళలు దుర్మరణం 

సాక్షి, చెన్నై: రోడ్డుకిరువైపులా మొక్కలు నాటుతున్న మహిళలపై లారీ దూసుకెళ్లడంతో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారు. మంగళవారం  ఉదయం చెన్నై ఔటర్‌రింగ్‌ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. వండలూరు నుంచి మీంజురు దాకా ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు ఇరు వైపులా మొక్కలు నాటే కార్యక్రమం సాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం కుండ్రత్తూరు సమీపంలో మహిళా కార్మికులు రోడ్డు పక్కగా మొక్కలు నాటే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సమయంలో పూందమల్లి నుంచి తాంబరం వైపు వెళుతున్న లారీ అదుపుతప్పి మినీవ్యాన్‌ను ఢీకొని రోడ్డు పక్కగా మొక్కలు నాటే పనిలో ఉన్న మహిళలపై లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో వయనల్లూరుకు చెందిన పచ్చమ్మాల్‌(45), చెంచులక్ష్మి (28) సంఘటన స్థలంలో మృతిచెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సుగంధి(40) మరణించింది. 

ప్రాణం తీసిన సెల్ఫీ మోజు 
చెన్నై: రాళ్ల క్వారీలో సెల్ఫీ తీసుకుంటూ, ఈతకు సిద్ధమైన ఇద్దరు మిత్రులు ప్రమాదవశాత్తు బలి అయ్యారు. చెన్నై నగర శివార్లలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుకుంటున్న దినేష్‌కుమార్‌(22), ఆకాశ్‌(22), రంజన్, సెల్వకుమార్‌ సోమవారం సాయంత్రం త్రిసూలం రాళ్ల క్వారీలో సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. ఈత సరదాతో నీళ్లలో దిగేందుకు దినేష్‌కుమార్‌ యత్నించాడు. నీళ్లల్లోకి ఒక్కసారిగా అతడు కూరుకుపోవడాన్ని చూసిన ఆకాశ్‌ చేతుల్ని అందించి రక్షించే క్రమంలో తానూ అందులో పడ్డాడు. అయితే, ఈత తెలియని రంజన్, సెల్వకుమార్‌ ఆందోళనతో కేకలు పెట్టినా ఫలితం శూన్యం. మిత్రులు ఇద్దరు తమ కళ్ల ముందే నీళ్లలో మునిగిపోయారు. చీకటి పడడంతో గాలింపు కష్టతరమైంది. మంగళవారం గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది గాలించగా ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. మృతదేహాల్ని పోస్టుమార్టానికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు