వెంటాడిన విధి: నాడు తండ్రి, చెల్లి, తమ్ముడు..  ఇప్పుడేమో

15 Nov, 2022 16:33 IST|Sakshi
ప్రకాశ్‌(ఫైల్‌)

సాక్షి, కరీంనగర్‌: మండలంలోని ఊటూరు గ్రామానికి చెందిన దూడం ప్రకాశ్‌ (30) కుటుంబాన్ని విధి వెంటాడుతోంది. కుటుంబంలో ఒకరి తరువాత ఒకరి మరణం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కష్టాలకు ఎదురొడ్డిన ఆ యువకుడు కుంగిపోకుండా ధైర్యంగా నిలిచి కుటుంబానికి అండగా నిలిచాడు. యథావిధిగా పనిచేసుకుంటుండగా ఆ యువకుడిని సైతం రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. ఇప్పటికే ముగ్గురిని కోల్పోయి ఇంటి వద్ద ఉంటున్న తల్లి, భార్య, పిల్లలకు అండగా ఉంటున్న అతడిని రోడ్డు ప్రమాదంలో మృత్యువు వెంటాడింది. ప్రకాశ్‌ ఫెస్టిసైడ్, ఫర్టిలైజర్‌లో పది సంవత్సరాలుగా మార్కెటింగ్‌ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

తండ్రి గత కొన్నేళ్ల క్రితం చనిపోగా, ఆ తర్వాత చెల్లి, తమ్ముడు కూడా వివిధ కారణాలతో చనిపోయారు. అమ్మ ప్రమీల, భార్య స్వరూప, 5 సంవత్సరాలలోపు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అన్నీ తానై కుటుంబ భారం మోస్తున్నాడు. ఎప్పటిలాగే తన ద్విచక్రవాహనంపై సోమవారం ఇంటి నుంచి పెద్దపల్లికి వెళ్లిన అతడు తిరుగు ప్రయాణంలో సాయంత్రం వేళ పెద్దపల్లి జిల్లా రంగంపల్లి వద్ద రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు పెద్దపల్లి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో కరీంనగర్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. 

మరిన్ని వార్తలు