గుట్టు రట్టు: ఐదుసార్లు కళ్లుగప్పారు.. ఆరోసారికి దొరికిపోయారు

17 Oct, 2021 02:26 IST|Sakshi

నర్సీపట్నం నుంచి అహ్మద్‌నగర్‌కు గంజాయి రవాణా 

ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసిన పోలీసులు  

మార్గమధ్యంలో జహీరాబాద్‌లోనూ విక్రయాలు 

గుట్టురట్టు చేసిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: తూర్పు తీరంలోని నర్సీపట్నం సమీపంలో ఉన్న నక్కపల్లి క్రాస్‌ రోడ్స్‌ నుంచి పశ్చిమాన మహారాష్ట్రలో ఉన్న అహ్మద్‌నగర్‌కు గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న ముఠాకు హైదరాబాద్‌ ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చెక్‌ చెప్పారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రూ.30 లక్షల విలువైన 300 కేజీల సరుకు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరు ఇప్పటికే ఐదుసార్లు గంజాయిని అక్రమ రవాణా చేశారని, ఆరో విడతలో దొరికిపోయారని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ శనివారం తెలిపారు.

జేసీపీ ఎం.రమేశ్‌రెడ్డి, ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావులతో కలసి ఆయన మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన విలాస్‌ భావ్‌సాహెబ్‌ తన వాహనంలో ఏపీకి కూరగాయలు రవాణా చేసేవాడు. అదే ప్రాంతానికి చెందిన ధ్యానేశ్వర్‌ మోహితే ఇతడికి సహకరించేవాడు. ఈ వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోవడంతో వీరిద్దరూ కలసి గంజాయి అక్రమ రవాణా చేయాలని నిర్ణయించారు.

దీంతో విశాఖ ఏజెన్సీలో ఉన్న కొందరు గంజాయి వ్యాపారులు, రైతులతో పరిచయాలు ఏర్పాటు చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి కూరగాయలకు వినియోగించే ఖాళీ ట్రేలతో బయలుదేరేవాళ్లు. నక్కపల్లి క్రాస్‌ రోడ్స్‌ వద్ద గంజాయిని లోడ్‌ చేసుకుని ఆ ఖాళీ ట్రేల మధ్యలో ఉంచేవాళ్లు. తనిఖీల్లో ఎవరైనా అడిగితే కూరగాయలు అన్‌లోడ్‌ చేసి వస్తున్నామని చెప్పేవారు. 

హైదరాబాద్‌ మీదుగా అహ్మద్‌నగర్‌కు.. 
సరుకును తమ వాహనంలో అన్నవరం, రాజమండ్రి, విజయవాడ, సూర్యాపేట, హైదరాబాద్, జహీరాబాద్‌– హమ్నాబాద్‌ (కర్ణాటక) మీదుగా వారు అహ్మద్‌నగర్‌కు చేర్చేవాళ్ళు. కేజీ గంజాయిని రూ.1,500 కొనుగోలు చేసి, మహా రాష్ట్రలో కేజీ రూ.10 వేలకు విక్రయించే వారు. పుణే, ముంబై, నాసిక్‌లలో ఉన్న గంజాయి వ్యా పారులకు ఎక్కువగా సరఫరా చేసేవారు. మా ర్గం మధ్యలో ఉన్న మరికొందరు గంజాయి వ్యా పారులతోనూ వీళ్లు ఒప్పందాలు చేసుకున్నారు. ప్రధానంగా జహీరాబాద్‌లోని ఓ దాబా వద్ద ఆగి ఆ ప్రాంతంలో పాటు హైదరాబాద్‌కు చెంది న వ్యాపారులకు కిలోల లెక్కన అమ్మే వాళ్లు.

వీరి ద్వారా ఆ సరుకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతా లకు చేరేది. విలాస్, ధ్యానేశ్వర్‌లు తమ వాహనంలో ఒక్కో దఫా 200 నుంచి 400 కేజీల చొ ప్పున ఐదుసార్లు మహారాష్ట్రకు తరలిం చారు. వీరి దందాపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీకాంత్, బి.అశోక్‌రెడ్డి, జి.శివానందం, మలక్‌పేట ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌తో కలసి శనివారం ముసారాంబాగ్‌ చౌరస్తా వద్ద స్మగ్లింగ్‌ చేస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు.  

మరిన్ని వార్తలు