క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా గుట్టురట్టు

17 Dec, 2020 04:06 IST|Sakshi
నిందితుల నుంచి స్వాదీనం చేసుకున్న నగదు, ఇతర సామగ్రిని పరిశీలిస్తున్న ఎస్పీ అన్బురాజన్‌

31 మంది బుకీల అరెస్ట్‌ 

రూ.లక్ష నగదు, 6 కిలోల గంజాయి, రెండు వాహనాలు, ఏడు ల్యాప్‌టాప్‌లు స్వాదీనం 

రూ.34.78 కోట్ల విలువైన బ్యాంక్‌ ఖాతాలు ఫ్రీజ్‌ చేయించేందుకు నిర్ణయం

కడప అర్బన్‌:  వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు కేంద్రంగా క్రికెట్‌ బెట్టింగ్‌ కార్యకలాపాలు సాగిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బెట్టింగ్‌ స్థావరాలపై దాడులు నిర్వహించి 31 మంది బుకీలను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.లక్ష నగదు, 6 కిలోల గంజాయి, రెండు కార్లు, 7 ల్యాప్‌టాప్‌లు, 8 కాలిక్యులేటర్లు, రెండు కమ్యూనికేటర్లు, పది బెట్టింగ్‌ అకౌంట్‌ పుస్తకాలను స్వాదీనం చేసుకున్నారు. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రొద్దుటూరు వినాయక నగర్‌కు చెందిన షేక్‌ షాహీద్‌ అక్రమ్, ఖాజామొహిద్దీన్‌ అలియాస్‌ కల్తీ, భూమిరెడ్డి సురేష్ రెడ్డి, మునగా రామాంజనేయులు అలియాస్‌ రాము మరికొంతమంది కలిసి దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్న నెట్‌వర్క్‌ ద్వారా బెట్టింగ్‌ కార్యకలాపాలు నిర్వహించడమే కాకుండా గంజాయి కూడా అమ్ముతున్నారు.

ప్రస్తుతం అరెస్టైన వారు, పరారీలో ఉన్న ప్రధాన బుకీలు కలిసి సుమారు రూ.34.78 కోట్ల మేర బెట్టింగ్‌లు నిర్వహించినట్టు ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితులకు సంబంధించిన బ్యాంక్‌ అకౌంట్లు, ఆస్తుల వివరాలను సేకరించి ఇన్‌కం ట్యాక్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లకు నివేదిస్తామన్నారు. వీరిని అరెస్ట్‌ చేయడంలో కృషి చేసిన ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ చక్రవర్తి, అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌) దేవప్రసాద్, ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాద్‌రావును, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.  

మరిన్ని వార్తలు