వైద్య విద్యార్థిని కిడ్నాప్‌ కేసులో 32 మంది అరెస్టు

11 Dec, 2022 02:23 IST|Sakshi
వైద్య విద్యార్థిని కిడ్నాప్‌ కేసులో అరెస్టు అయిన నిందితులు 

అందరూ నవీన్‌రెడ్డి ‘మిస్టర్‌ టీ’లో పని చేసేవారే.. 

పరారీలో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి సహా మరో నలుగురు 

ఇబ్రహీంపట్నం రూరల్‌: సంచలనం సృష్టించిన వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్‌ ఘటనలో మొత్తం 36 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వారిలో 32 మంది నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి సహా మరో నలుగురు పరారీలో ఉన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మన్నెగూడ సంపద హోమ్స్‌లోని ఓ ఇంటిపై దాడి చేసిన దుండగులు సినీఫక్కీలో వైద్య విద్య అభ్యసిస్తున్న యువతిని కిడ్నాప్‌ చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఆదిభట్ల పోలీసుల విస్తృత గాలింపు నేపథ్యంలో కిడ్నాపర్లు వదిలి పెట్టడంతో, శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితులను పట్టుకునేందుకు బృందాలుగా రంగంలోకి దిగారు. శనివారం 32 మంది నిందితులను అరెస్టు చేశారు. దాడికి పాల్పడిన వారందరూ మిస్టర్‌ టీ పాయింట్‌లలో పనిచేసే సిబ్బందిగా గుర్తించారు.

నాగారం భాను ప్రకాశ్, రాథోడ్‌ సాయినాథ్, నాగారం కార్తీక్, గానోజీ ప్రసాద్, కొత్తి హరి, రాథోడ్‌ అవినాష్, అరిగేల రాజు, సోనుకుమార్‌ పాశ్వాన్, ఇర్ఫాన్, నీలేశ్‌కుమార్, బిట్టుకుమార్‌ పాశ్వాన్, పున్నా నిఖిల్, ఇస్లావత్‌ అనిల్, మహేశ్‌కుమార్‌ యాదవ్, రిజ్వాన్, ఇబారహార్, జావెద్‌ హుస్సేన్, బొడ్డుపల్లి సతీశ్, ముక్రమ్, బిశ్వజిత్‌ , అంగోతు యోగిందర్, నర్ర గోపీచంద్, బట్టు యశ్వంత్‌రెడ్డి, ముప్పాల మహేశ్, వంకాయలపాటి మణిదీప్, బోని విశ్వేశ్వర్‌రావు, శివరాల రమేశ్, మలిగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, జాదవ్‌ రాజేందర్, మిరాసాని సాయినాథ్, దామరగిద్ద శశికుమార్, గాదె కార్తీక్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని వైద్య పరీక్షల అనంతరం శనివారం రాత్రి ఇబ్రహీంపట్నం 15వ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు ఆదేశించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. 

పరారీలోనే ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి  
ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డితో పాటు వాజిద్, సిద్దు, చందు పరారీలో ఉన్నారని ఆదిబట్ల సీఐ నరేందర్‌రెడ్డి తెలిపారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, త్వరలోనే అరెస్టు చేస్తామని అన్నారు. 36 మంది నిందితుల్లో ముగ్గురు అయ్యప్ప మాల ధరించిన వారు ఉండటం గమనార్హం. కాగా ఈ కేసులో రెండు వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు.   

రెండేళ్లు కలిసి తిరిగారు..దాడి తప్పే  
ఆ అమ్మాయి నా కొడుకు ప్రేమించుకున్నారు. రెండేళ్లుగా కలిసి తిరిగారు. మా ఇంటికి కూడా అమ్మాయి చాలా సార్లు వచ్చింది. కరోనా సమయంలో ఆమె ను రోజూ కారులో కళాశాల వద్ద దింపి వచ్చేవాడు. పెళ్లి చేసుకున్నట్లు కూడా చెప్పాడు. తన వ్యాపారానికి సంబంధించిన డబ్బులు కూడా అమ్మాయి తండ్రి దామోదర్‌రెడ్డికి ఇచ్చేవాడు. వాళ్ల కోసం కారు కూడా తీసుకున్నాడు.

వాడిని అన్ని విధాలుగా వాడుకున్నారు. నిన్న అమ్మాయి ఇంటిపై జరిగిన దాడి తప్పే. కానీ అంతకుముందు జరిగిన విషయా లు కూడా పోలీసులు పరిగణనలోకి తీసుకోవాలి. కష్టపడి ఎదిగిన నా కుమారుడిని అమ్మాయి ఇష్టపడింది. గొడవలకు కారణం తెలియదు. ఆ అమ్మా యిని వదిలేయమని నవీన్‌కు చాలాసార్లు చెప్పాను. మంచి సంబంధాలు వస్తున్నాయని చెప్పినా వినిపించుకోలేదు.     
– నారాయణమ్మ, నవీన్‌రెడ్డి తల్లి   

‘టీ టైమ్‌’తో సంబంధం లేదు 
బంజారాహిల్స్‌: మన్నెగూడకు చెందిన యువతి వైశాలిని కిడ్నాప్‌ చేసిన కేసులో ప్రధా న నిందితుడు నవీన్‌రెడ్డికి ‘టీ టైమ్‌’తో ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ డైరెక్టర్‌ అర్జున్‌ గణేష్‌ స్పష్టం చేశారు. నవీన్‌రెడ్డి టీ టైమ్‌ సంస్థ ఓనర్‌ అంటూ కొన్ని మీడియా సంస్థల్లో (సాక్షి కాదు) వార్తలు ప్రసారం అయ్యాయని, అయితే టీ టైమ్‌ సంస్థకు నవీన్‌రెడ్డితో ఎలాంటి సంబంధాలు, ఒప్పందాలు లేవని, అలాగే అతనికి తమ ఫ్రాంచైజీలు కూడా లేవని తెలిపారు. నవీన్‌రెడ్డికి చెందిన సంస్థ పేరు ‘మిస్టర్‌ టీ టైమ్‌’ అని శనివారం విలేకరులకు వివరించారు. 

మరిన్ని వార్తలు