సోదాల పేరుతో సీబీఐ అధికారుల రచ్చ

13 May, 2022 05:28 IST|Sakshi

నలుగురు సీబీఐ ఎస్సైలు అరెస్ట్‌

న్యూఢిల్లీ: ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బులు గుంజేందుకు సోదాల పేరుతో హంగామా సృష్టించిన సీబీఐ అధికారులు నలుగురు అడ్డంగా దొరికిపోయారు. ఉన్నతాధికారులు వారిని డిస్మిస్‌ చేయడంతోపాటు అరెస్ట్‌ చేశారు. ఈనెల 10వ తేదీన సీబీఐ అధికారులమని చెబుతూ కొందరు తన ఆఫీసులోకి వచ్చి, నానా హంగామా సృష్టించారని చండీగఢ్‌కు చెందిన వ్యాపారవేత్త ఒకరు ఫిర్యాదు చేశారు. తనకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ బెదిరించి, రూ.25 లక్షలివ్వాలని డిమాండ్‌ చేశారని అందులో పేర్కొన్నారు.

తమ సిబ్బంది ఒకరిని పట్టుకోగా, మిగతా వారు పరారయ్యారని వివరించారు. ఈ ఫిర్యాదుపై సీబీఐ డైరెక్టర్‌ సుబోధ్‌కుమార్‌ జైశ్వాల్‌ వెంటనే స్పందించారు. విచారణ జరిపి ఈ నలుగురూ ఢిల్లీ సీబీఐ ఆర్థిక నేరాలు, ఇంటర్‌పోల్‌ ప్రొటోకాల్‌ డివిజన్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్సైలు సుమిత్‌ గుప్తా, అంకుర్‌ కుమార్, ప్రదీప్‌ రాణా, అకాశ్‌ అహ్లావత్‌లుగా గుర్తించారు. వీరి నివాసాలపై సోదాలు చేపట్టి, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురినీ అరెస్ట్‌ చేయడంతోపాటు వెంటనే విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలిచ్చారు. వీరిపై ఆరోపణలు రుజువైతే 10 ఏళ్ల నుంచి జీవితకాల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. 

మరిన్ని వార్తలు