బాలికను నిర్బంధించి 4 లక్షల సొత్తు చోరీ

1 Apr, 2021 04:24 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఇంట్లో ఎవరూ లేని సమయంలో దోపిడి.. బాగా తెలిసినవారి పనేనంటున్న పోలీసులు  

నెల్లూరు జిల్లాలో ఘటన  

నెల్లూరు(క్రైమ్‌): ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఇద్దరు దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. దాదాపు 4 లక్షల విలువైన సొత్తును దోచుకెళ్లారు. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని మూలాపేట రాజుగారివీధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. పోలీసుల సమాచారం మేరకు.. రాజుగారివీధిలో నివాసముంటున్న సుజాత, ఖాదర్‌మస్తాన్‌ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు. ఈ నెల 30వ తేదీ రాత్రి సుజాత కూరగాయల కోసం మార్కెట్‌కు వెళ్లగా, ఖాదర్‌మస్తాన్‌ ఇంట్లో లేడు. కుమార్తె హాల్లో ఉండగా, కుమారుడు బాత్‌రూమ్‌లో స్నానం చేస్తున్నాడు.

ఆ సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్క్‌ ధరించి ఇంట్లోకి చొరబడ్డారు. దుండగుల్లో ఒకరు బాలిక అరవకుండా ఆమె గొంతు నొక్కిపట్టాడు. మరో దుండగుడు ఇంటి ప్రధాన తలుపుతో పాటు బాత్‌రూమ్‌కు గడియ పెట్టాడు. ఆ తర్వాత బీరువాలోని సుమారు రూ.2 లక్షలకు పైగా విలువ చేసే 8.5 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదును దోచుకున్నారు. అనంతరం బాలికను వదిలేసి ఇంటికి బయట గడియ పెట్టి దుండగులు పరారయ్యారు. బాలిక బాత్‌రూమ్‌ గడియ తీసి జరిగిన విషయాన్ని తన సోదరుడితో చెప్పింది. జరిగిన విషయాన్ని తల్లికి ఫోన్‌ ద్వారా తెలియజేశారు.

హుటాహుటిన ఇంటికి చేరుకున్న సుజాత.. దుండగుల చర్యలతో గాయపడిన కుమార్తెను సమీపంలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించింది. దోపిడీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీం వేలిముద్రలు సేకరించింది. బాగా తెలిసిన వారే ఈ దోపిడీకి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.    

మరిన్ని వార్తలు